పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయాలె : సబితాఇంద్రారెడ్డి

పిల్లల్లోని ప్రతిభను బయటకు తీయాలె :   సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  విద్యార్థుల  ప్రతిభను టీచర్లే వెలికితీయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు. దేవుడు లేడనే నాస్తికులకూ గురువులుంటారని తెలిపారు.  సర్కారు స్కూళ్లు, విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్లను తక్కువచేసి చూడొద్దని.. సానపెడితే వారిలోనూ జాతిరత్నాలను వెలికి తీయొచ్చని స్పష్టం చేశారు.  మంగళవారం ట్యాంక్ బండ్ పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రి నివాళులు అర్పించారు. 

అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో  నిర్వహించిన టీచర్స్ డే వేడుకలకు హాజరై, మాట్లాడారు. ప్రతివ్యక్తి జీవితంలో టీచర్ల పాత్ర ప్రముఖంగా ఉంటుందని మంత్రి సబితా తెలిపారు. టీచర్లు సమాజ నిర్మాతలని, మన రాష్ట్ర విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని కోరారు. 

రంజాన్‌, క్రిస్మస్‌, దీపావళి పండుగలను కొంతమంది మాత్రమే జరుపుకుంటారని, అన్ని వర్గాలు జరుపుకునే పండుగ గురుపూజోత్సవమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఏవీఎన్​ రెడ్డి, వాణిదేవి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్  ప్రొఫెసర్ లింబాద్రి, ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 140 మంది బెస్ట్ టీచర్లకు అవార్డులను ప్రదానం చేశారు.