ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే.. 25 వేలు ఫైన్!

ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే.. 25 వేలు ఫైన్!

పోర్టోఫినో(ఇటలీ): లేత రంగులద్దిన ఇండ్లు, పురాతన కోటలు, చుట్టూ సముద్రం, దాని అంచున తేలియాడుతున్నట్లుగా ఉండే హోటళ్లు, ఎటు చూసినా పచ్చదనం.. ప్రకృతి అందాలు, మరెన్నో విశేషాలు ఇటలీలోని పోర్టోఫినో సిటీకి సొంతం. ఇటలీలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే సిటీలలో ఇదొకటి. కట్టిపడేసే అందాలున్న ఈ ప్రాంతానికి వచ్చాక టూరిస్టులు సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు.. కానీ, ఇప్పుడదే అక్కడి స్థానికులకు తంటాలు తెచ్చిపెట్టింది. టూరిస్టులంతా సెల్ఫీలు తీసుకుంటూ రోడ్లపై ఆగుతుండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. 

ఆఫీస్​లకు, స్కూళ్లకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పోర్టోఫినో మేయర్ మాటియో వయాకావా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త రూల్ తెచ్చారు. నో వెయిటింగ్ జోన్​లను ప్రవేశపెట్టారు. బ్యూటీ లొకేషన్లలో టూరిస్టులు ఫొటోలు తీసుకోకూడదని కండిషన్లు పెట్టారు. ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే ఏకంగా రూ.24,777 (275 యూరోలు) పెనాల్టీ విధిస్తామని ప్రకటించారు. ఈ మధ్యే అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ఈ ఏడాది అక్టోబర్ వరకు అమల్లో ఉంటుందన్నారు. రోజు ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీధుల్లో సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం ఉంటుందన్నారు.

 ‘నగరానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరిగింది. వాళ్లంతా ముఖ్యంగా రెండు లొకేషన్లలో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. అందుకే పెనాల్టీ రూల్ తెచ్చాం” అని మేయర్ మాటియో చెప్తున్నారు. అయితే, సెల్ఫీలపై బ్యాన్ విధించిన సిటీ పోర్టోఫినో ఒక్కటే కాదు.. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లోని కొన్ని సిటీల్లోనూ ఇలాంటి కండిషన్లే అమల్లో ఉన్నాయి.