
- ఆదివాసీ గ్రామాలకు తొలగిన దారి కష్టాలు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మిలటరీ చీఫ్ మడవి హిడ్మా సొంత ఊరు పువ్వర్తిలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) బేలీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ బ్రిడ్జి పూర్తి కావడంతో దండకారణ్యంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా శత్రుదుర్భేద్యమైన మావోయిస్టుల కోట పువ్వర్తికి దారి కష్టాలు తీరాయి.
ఇప్పటికే కేంద్ర హోంశాఖ పువ్వర్తిలో సీఆర్పీఎఫ్ బలగాలతో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల ప్రభావం తగ్గింది. ఇప్పుడు రహదారి నిర్మాణంతో పువ్వర్తి, సిల్గేర్, తిమ్మాపురం, గొల్లాకొండ, టేకల్‌గూడ, జబ్బాగట్ట, తులంపాడ్ గ్రామాల ఆదివాసీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు మెరుగుపడతాయి. బేస్ క్యాంప్ వరకు వాహనాలు చేరుకుంటాయి.
బేలీ డిజైన్‌తో బ్రిడ్జి..
రూ.66 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్మిజం) నిధులతో పువ్వర్తి గ్రామం వరకు 64 కి.మీల రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో ఎల్మాగూడ- పువ్వర్తి వరకు 51 కి.మీలు పూర్తిగా దండకారణ్యంలోనే ఉంది. రూ.53 కోట్ల ఖర్చుతో 51 కి.మీల రహదారిని సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించారు.
పువ్వర్తి వద్ద ఉన్న వాగుపై 1940లో బ్రిటీష్ సర్కారులో నాటి ఇంజనీర్ డొనాల్డ్ బేలీ తయారు చేసిన డిజైన్‌తో బేలీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 15 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి పూర్తిగా స్టీల్‌తో నిర్మించారు. భారీ వాహనాలు సైతం ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లవచ్చు. పువ్వర్తి గ్రామానికి చేరుకొనేందుకు అడ్డంకిగా ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలకు తిప్పలు తప్పాయి. దండకారణ్యంలోని కీలకమైన పువ్వర్తి ప్రస్తుతం భద్రతాబలగాల ఆధీనంలోకి వచ్చేసింది.