తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు!

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు!
  •     భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జోరుగా దళారుల దందా 
  •     పాల్వంచలో ప్రొహిబిటెడ్​ల్యాండ్​లోనూ రిజిస్ట్రేషన్లు 
  •     లాంగ్​లీవ్ లో కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్? 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయిస్తూ దళారులు దందా కొనసాగిస్తున్నారు. కొత్తగూడెంలో ప్లాట్లు, పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలోని 817, 444, 999, 729, 410 సర్వే నంబర్లలోని నిషేధిత భూముల​ను దళారులు తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్​ చేయిస్తున్నారు. ల్యాండ్​ ఒక చోట, సర్వే నంబర్​ మరో చోట ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ​చేయడం గమనార్హం.

ఎవరైనా రిజిస్ట్రేషన్​ కోసం కొత్తగూడెంలోని సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​కు వెళ్తే ప్రొహిబిటెడ్​ ల్యాండ్​ అని తెలుసుకొని దళారులు ఎంటర్​ అవుతున్నారు. ఆఫీసర్లు, సిబ్బందితో రూ.లక్షల్లో సెటిల్​మెంట్ ​చేసుకుంటూ అందినకాడికి వసూలు చేస్తున్నారు.  ప్రొహిబిటెడ్ ​ల్యాండ్​ను కూడా రిజిస్ట్రేషన్​ చేయిస్తుండడం ఇక్కడ కామన్​గా మారింది.  

ఇదీ.. పరిస్థితి..   

కొత్తగూడెం పట్టణం హనుమాన్​ బస్తీకి చెందిన వాసాల పోశమ్మ 60 గజాల ల్యాండ్​ను రిటైర్డ్​హెడ్​ కానిస్టేబుల్​కు పదేండ్ల కింద అమ్మారు. అతడు పోశమ్మకు తెలియకుండా ఆమెకు చెందిన మరి కొంత స్థలాన్ని ఆక్రమించుకున్నాడు.  ఆ తర్వాత తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 120 గజాల ల్యాండ్​ను రిజిస్ట్రేషన్​ ఆఫీస్​ సిబ్బందితో కుమ్మక్కై తన కుటుంబ సభ్యుల పేర రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడు. 2018లో తప్పుడు డాక్యుమెంట్లతో తన భార్య పేరుతో  ఉన్న ఆ ల్యాండ్​ను కొడుకు పేరుపై  నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్​ డీడ్​ చేయించాడు. 143సర్వే నంబర్​లో ఉన్న ఆ ల్యాండ్​ను డబ్బులు తీసుకున్న రిజిస్ట్రేషన్​ ఆఫీసర్, కొందరు సిబ్బంది 181 సర్వే నంబర్ పేర రిజిస్ట్రేషన్​ చేయించుకున్న దాఖలాలున్నాయి.  జీఓ 76 ద్వారా 118 గజాలను అతడి భార్య పేర రిజిస్ట్రేషన్​చేయించుకున్నాడు. 
    

  • పట్టణంలోని గాజుల రాజం బస్తీ, విశ్వనాథ్​నగర్​ ప్రాంతాల్లో వేరే సర్వే నంబర్​లో ఉన్న దాదాపు రూ.కోటి నుంచి రూ. 1.50కోట్ల విలువైన 25 నుంచి రూ. 30 కుంటల ల్యాండ్​ను కొందరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ ఆఫీసర్లతో కుమ్ముక్కై తమ పేర రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు. ఇందులో సగం మేర గవర్నమెంట్​ ల్యాండ్​ ఉండడం గమనార్హం. 

లాంగ్​ లీవ్​లో ఆఫీసర్...

తప్పుడు డాక్యుమెంట్లు, నిబంధనలకు విరుద్ధంగా గవర్నమెంట్​ల్యాండ్స్, ప్రొహిబిటెడ్​ల్యాండ్స్​ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్​ చేసిండనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం సబ్​ రిజిస్ట్రార్​ లాంగ్​ లీవ్​లో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సబ్​ రిజిస్ట్రార్​ అక్రమాలపై  కొందరు ఉన్నతాధికారుల దృష్టికి ​తీసుకెళ్లడంతో ఉన్నతాధికారుల సూచనతో ఆ అధికారి లాంగ్​ లీవ్​లో వెళ్లాడని పలువురు చర్చించుకుంటున్నారు. 

గతంలో జరిగినవి నాకు తెలియదు 

గతంలో తప్పుడు డాక్యుమెంట్లతో, గవర్నమెంట్​ ల్యాండ్​తో పాటు ప్రొహిబిటెడ్​ల్యాండ్స్​ను రిజిస్ట్రేషన్​ చేసిన విషయం నాకు తెలియదు. నేను ఇన్​చార్జ్​గా వచ్చాను. కొత్తగూడెం పట్టణంలోని వాసాల పోశమ్మకు సంబంధించి ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ మొదట 181 సర్వే నంబర్..​ తర్వాత అదే భూమిని 143 సర్వే నంబర్​పై రిజిస్ట్రేషన్​ చేయడం తప్పే. డాక్యుమెంట్ల ప్రకారం మేము రిజిస్ట్రేషన్​ చేస్తాం. 

- రాంకుమార్, ఇన్​చార్జ్​ సబ్​ రిజిస్ట్రార్, కొత్తగూడెం