బెంగుళూరు: చంపేస్తానని బెదిరించడం, కుటుంబ సభ్యులను వేధించడంతో సొంత తమ్ముడినే ఫ్రెండ్స్‌తో కలిసి హత్య చేశాడు ఓ యువకుడు. కారులో తమ్ముడిని చంపేసి అనంతరం మృతదేహాన్ని క్వారీలో పడేశాడు. ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగుళూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శివరాజ్, ధన్‌రాజ్ అన్నదమ్ములు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సెకండ్ ఫేజ్ లో నివాసం ఉంటున్నారు. ధన్ రాజ్ మద్యానికి బానిసై నేరాలకు పాల్పడటంతో పాటు అన్న శివరాజ్‌ను హత్య చేస్తానని బెదిరించడం, కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.
తమ్ముడి ప్రవర్తనతో విసిగెత్తిపోయిన శివరాజ్.. ఎలాగైనా ధన్ రాజ్‌ను అంతమొందించాలని ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2025, నవంబర్ 2వ తేదీన తమ్ముడిని కారులో బయటకు తీసుకెళ్లాడు. ముందుగానే కారులో కొడవలి పెట్టుకున్న శివరాజ్ దానితో తమ్ముడిపై దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడ్డ ధన్‌రాజ్ కారులోనే ప్రాణాలు విడిచాడు. అనంతరం ఫ్రెండ్స్‌తో కలిసి తమ్ముడి డెడ్ బాడీని క్వారీలో పడేసి వెళ్లిపోయాడు శివరాజ్. నవంబర్ 6న బన్నేర్ఘట్ట-కగ్గలిపుర ప్రధాన రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | ఉపరాష్ట్రపతిగా రాజీనామా తర్వాత.. తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగదీప్ ధంఖర్
సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్వారీలోకి ఏదో మూట విసిరేసి వెళ్లినట్లు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. తమ్ముడిని తానే హత్య చేసినట్లు శివరాజ్ ఒప్పుకున్నాడు. చంపేస్తానని బెదిరించడం, కుటుంబ సభ్యులను వేధించడంతో హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో శివరాజ్‌తో పాటు మరో ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
