బీఆర్ఎస్ ఖజానాలో రూ.1,509 కోట్లు.. బ్యాంకుల్లో ఉన్నవే రూ.1,431 కోట్లు

బీఆర్ఎస్ ఖజానాలో రూ.1,509 కోట్లు.. బ్యాంకుల్లో ఉన్నవే రూ.1,431 కోట్లు
  • లాంగ్​టర్మ్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లు రూ.1,237 కోట్లు.. వడ్డీల మొత్తం రూ.97 కోట్లు
  • ఎన్నికల సంఘానికి వార్షిక నివేదిక సమర్పించిన పార్టీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ ఖజానా మాత్రం కళకళలాడుతోంది. దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా ఉన్న గులాబీ పార్టీకి రూ.1,509.42 కోట్ల ఆస్తులున్నట్టు తేలింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈసీకి ఆ పార్టీ సమర్పించిన యాన్యువల్​ ఆడిట్ రిపోర్టే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

గతంతో పోలిస్తే ఈ ఏడాది పార్టీ ఖజానాకు కొంత నష్టం వచ్చినా.. అది నామమాత్రమే. 2024–25లో బీఆర్ఎస్​ ఆస్తులు రూ.1,560 కోట్లు కాగా.. 2025లో రూ.51 కోట్లు తగ్గింది. పార్టీ ఆడిట్​రిపోర్టులో వెల్లడించిన దాని ప్రకారం.. బ్యాంకుల్లో ఫిక్స్​డ్​డిపాజిట్లు, లోన్లు, ఆదాయం, స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.1,509,42,68,576 కావడం విశేషం. 

బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు

మొత్తం రూ.1,509 కోట్ల ఆస్తుల్లో.. నగదు రూపంలోనే రూ.1,431 కోట్లున్నట్టు పేర్కొనడం గమనార్హం. అందులో ఏడాది కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న షెడ్యూల్డ్ బ్యాంక్ ఫిక్స్‌‌ డ్ డిపాజిట్లు ఏకంగా రూ.1,237.80 కోట్లు ఉన్నాయి. కరెంట్ అకౌంట్లు, క్యాష్​ బ్యాలెన్స్​ బీవోబీ, ఎస్బీఐ తదితర బ్యాంకు అకౌంట్లలో రూ.188.31 కోట్లు నిల్వలున్నాయి. ఒక్క బంజారాహిల్స్ బీవోబీ అకౌంట్‌‌లోనే రూ.158.54 కోట్లు ఉననాయి. పార్టీ భవనాలు, స్థలాలు, ఆఫీస్​ల విలువ రూ.66.26 కోట్లుగా చూపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఫర్నిచర్ రూ.12.38 కోట్లు కాగా.. జిల్లాల్లోని పార్టీ ఆఫీస్​ల విలువ రూ. 14.30 కోట్లు.

పక్క రాష్ట్రాల్లోనూ ఆఫీస్​లు

బీఆర్ఎస్​గా మారిన తర్వాత మహారాష్ట్రలోనూ పార్టీ ఆఫీస్​లను తెరిచారు. పుణెలో రూ.11.73 కోట్లు, నాగ్​పూర్​లో ఉన్న భవనం రూ.6.97 కోట్లని  ​రిపోర్టులో చెప్పారు. అయితే, ఇక్కడ బంజారాహిల్స్​లో ఉన్న తెలంగాణ భవన్​విలువ రూ.2.39 కోట్లతో పోలిస్తే.. మహారాష్ట్రలో ఉన్న భవనాల విలువే ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు హైదరాబాద్​లోని కోకాపేటలో పార్టీకి భూముల  విలువ రూ.7.07 కోట్లు, ఢిల్లీ పార్టీ ఆఫీస్ భూమి రూ.1.78 కోట్లు, జిల్లాల్లోని భూములు రూ.1.26 కోట్లని, వాహనాల విలువ రూ.7.02 కోట్లని తెలిపారు. ఈ ఒక్క ఏడాదే కొత్తగా రూ.4.84 కోట్ల విలువైన వాహనాలు కొనుగోలు చేశారు,

ఆదాయం రూ.114.48 కోట్లు 

గత ఆర్థిక ఏడాదిలో పార్టీకి మొత్తం రూ. 114.48 కోట్ల ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులో బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీల రూపంలోనే రూ.97.37 కోట్లు, సేవింగ్​ఖాతాల ద్వారా రూ. 8.68 లక్షలు వచ్చాయి. కంపెనీలు, కార్పొరేట్ సంస్థల నుంచి నేరుగా రూ.16.01 కోట్లు విరాళాలు అందాయి. ఇండివిడ్యువల్ వ్యక్తుల నుంచి రూ.43.14 లక్షలు, ఇతర సాధారణ విరాళాల కింద రూ.21,674 వచ్చాయి. ఇక, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి లెజిస్లేటివ్ పార్టీ ఫీజు కింద రూ.26.45 లక్షలు, ఎంపీల నుంచి పార్లమెంటరీ పార్టీ ఫీజుగా రూ.1.15 లక్షలు వసూలైనట్టు వెల్లడించారు. 

ప్రచారం, లీగల్ ఖర్చులకే మోత

వచ్చిన ఆదాయం రూ.114.48 కోట్లు కాగా.. పార్టీ పెట్టిన ఖర్చు రూ.162.91 కోట్లు. ఇందులో ప్రచారం, సభలకే రూ.137.65 కోట్లు ఖర్చు చేశారు. బహిరంగ సభలు, సమావేశాలకు రూ.57.51 కోట్లు, టీవీ, పత్రికా ప్రకటనలకు  రూ.53.68 కోట్లు, ప్రచారానికి రూ.24.85 కోట్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖర్చులకు రూ.1.60 కోట్లు అయ్యాయి. కోర్టు వివాదాలు, న్యాయ పోరాటాల కోసం లాయర్ల ఫీజులు, లీగల్ చార్జీల కింద రూ.13.40 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.