హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులను నిండా ముంచింది బీఆర్ఎస్ యేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్ల పాటు యువతను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఆదివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా గ్రూప్-1 ఉద్యోగాలను భర్తీ చేయని చరిత్ర బీఆర్ఎస్‌ది అని విమర్శించారు.
అధికారం కోల్పోయాక ఇప్పుడు నిరుద్యోగులపై బీఆర్ఎస్ నేతలు కపటప్రేమ చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఎల్బీ స్టేడియం, శిల్పారామం, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా 70 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. ‘‘కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదు.
ఒకవేళ పరీక్షలు పెట్టినా పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన జీవన్ రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోగానే అబద్ధాలు మొదలుపెట్టారు. తెలంగాణ భవన్‌కు వెళ్లగానే ఆయనకు అబద్ధాలు అలవడ్డాయి. అక్కడ 17 ఉద్యోగాలే ఇచ్చారని మాట్లాడడం సిగ్గుచేటు” అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సన్నబియ్యం గేమ్ చేంజర్ అని, కేసీఆర్ పాలన పాపాల భైరవుడి పాలన అని గతంలో జీవన్ రెడ్డి అన్న మాటలను ఆయన గుర్తు చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేసేందుకే జీఓ నంబర్ 7 తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కాలేజీ యాజమాన్యాలు అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కాలేజీ యజమానులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
