ఊర్లు సంబురపడుతున్నయ్..ఎలక్షన్​ టూరిస్టులను నమ్మొద్దు : సతీశ్​కుమార్​

ఊర్లు సంబురపడుతున్నయ్..ఎలక్షన్​ టూరిస్టులను నమ్మొద్దు : సతీశ్​కుమార్​
  •     ఎలక్షన్​ టూరిస్టులను నమ్మొద్దు
  •     బీఆర్ఎస్​ హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్​కుమార్​

హుస్నాబాద్​, వెలుగు : గత పాలకుల హయాంలో సమస్యలతో తల్లడిల్లిన ఊర్లలో సకల సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు ప్రజలంతా సంబురంగా ఉన్నారని బీఆర్ఎస్​ హుస్నాబాద్​అభ్యర్థి వొడితల సతీశ్​కుమార్​అన్నారు. ఎట్లున్న పల్లెలు ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. ఎలక్షన్ టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారని, బీఆర్ఎస్​ మాత్రం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. సోమవారం ఆయన సైదాపూర్​ మండలం ఎలబోతారం, చింతలపల్లి, రాములపల్లి, రామచంద్రాపూర్, కురుమపల్లి, జాగీర్​పల్లి,  వెన్కేపల్లిలో ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిడ్​మానేరుతో చిగురుమామిడి, సైదాపూర్​ మండలాలు, దేవాదులతో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, శనిగరం, సింగరాయ ప్రాజెక్టులతో కోహెడ మండలం సస్యశ్యామలమైందని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్​, బీజేపీ, సీపీఐ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు.  నీళ్లు రాకుండా ఎన్‌జీటీలో కేసులు వేయించారన్నారు. నియోజకవర్గంలోని  ప్రతి గ్రామంలో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల అభివృద్ధి పనులు చేశానని, రూ.61కోట్లతో తండాలను డెవలప్​ చేశానని, మొత్తం  రూ.9వేల కోట్లతో నియోజకవర్గాన్ని  నభూతోనభవిష్యత్​ అన్నట్టు తీర్చిదిద్దానన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఈ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. 

బీఆర్​ఎస్​లో చేరిన బీజేపీ కార్యకర్తలు

సతీశ్​కుమార్​ సమక్షంలో పలువురు బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్​లో చేరారు. బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి కందుకూరి సతీశ్​, హుస్నాబాద్​ పట్టణ కార్యదర్శి వేముల శ్రావణ్​, బీజేవైఎం అక్కన్నపేట మండల అధ్యక్షుడు కార్తిక్​తో బీఆర్ఎస్​లో చేరారు.