
- హైకోర్టులో వేర్వేరుగా కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు
- సాక్షిగా సమన్లు జారీ చేసి కమిషన్ తప్పుదోవ పట్టించింది
- నోటీసు జారీ చేయడంతోపాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి
- అలా చేయకుండా మాకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది
- బీఆర్‌ఎస్‌ను కించపరచాలన్న దురుద్దేశంతో రాజకీయ ప్రేరేపితంగానే కమిషన్
- కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం, కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏర్పాటైందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టును కొట్టేయాలని కోరారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం ఇచ్చిన జీవో 6ను సవాల్ చేస్తూ మంగళవారం కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. సాక్షిగా సమన్లు జారీ చేయడం ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ పిటిషనర్‌ను తప్పుదోవ పట్టించిందని తెలిపారు. ఒక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన నివేదిక ఆ వ్యక్తి ప్రతిష్టపై దుష్ప్రభావం చూపుతుందన్నపుడు నోటీసు జారీ చేయడంతోపాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పించాలని, అలాకాకుండా తమకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఆ నివేదికను రద్దు చేయాలని కోరారు. అసలు కమిషన్ ఏర్పాటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరచాలన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రణాళిక, డిజైనింగ్, అవకతవకలపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్, హరీశ్ , ఈటల రాజేందర్‌సహా 116 మందిని విచారించిన కమిషన్.. జులై 31న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. కాళేశ్వరం వైఫల్యానికి కారణం కేసీఆర్, హరీశ్‌రావులేనని నివేదికలో కమిషన్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ నివేదికపై వారు కోర్టును ఆశ్రయించారు.
ప్రతిష్టకు భంగం కలుగుతున్నది
విచారణ కమిషన్ సాకుతో తమ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందని కేసీఆర్, హరీశ్‌రావు తమ పిటిషన్లలో ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రూపొందించిన నివేదికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నివేదిక కాపీని తమకు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణలకు ఇవ్వడం దురుద్దేశపూరితమని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. నీటిపారుదల సామర్థ్యం, సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టును నిబంధనల ప్రకారమే చేపట్టామని తెలిపారు. నిర్మాణానికి ముందు పూర్తిస్థాయిలో అధ్యయనం జరిగిందని, అనంతరం మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపిందని వెల్లడించారు.
కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది
ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏదో ఒక సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిందని పిటిషన్లలో కేసీఆర్, హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలో ఒక పియర్ కూలిపోవడాన్ని కారణంగా చూపించి ప్రాజెక్టుపైనే దుష్ప్రచారం చేస్తూ వచ్చిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన పేరును దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికి, హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో, పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలతో ఉందన్నారు. నివేదిక కాపీని పిటిషనర్లకు అందజేయకుండా సంక్షిప్త సారాంశం గురించి మీడియాకు పదే పదే వెల్లడించడం ఏకపక్షం, దురుద్దేశపూరితం తప్ప మరోటి కాదని తెలిపారు.
న్యాయ విచారణ జరిపే పరిధి లేదు
విచారణ కమిషన్ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణ జరిపే పరిధి లేదని కేసీఆర్, హరీశ్‌రావు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. గత ప్రవర్తనకు సంబంధించి విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ జీవో జారీ చేయడం విచారణ కమిషన్ చట్టానికి విరుద్ధమని, విచారణ కమిషన్లు కేవలం వాస్తవాలను వెల్లడించే పరిధిని మాత్రమే కలిగి ఉంటాయని తెలిపారు. వాటి సిఫారసులు.. పరిపాలన, చట్టపరమైన చర్యలకు ఉపయోగపడాలి తప్ప గత ప్రవర్తన ఆధారంగా బాధ్యులను చేయకూడదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా, మంత్రిగా 2014 నుంచి 2023 దాకా గత ప్రవర్తనపై విచారించిందని, పిటిషనర్ల ప్రతిష్టను ప్రభావితం చేసేలా నివేదిక రూపొందిందని ఆరోపించారు. కాగా, పిటిషన్లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి.