
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్
- రాజకీయ కక్షతోనే కవితను అరెస్ట్ చేశారు
- బిడ్డ జైలులో ఉంటే తండ్రికి బాధ ఉండదా? అని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: రాజకీయ కక్షతోనే తన బిడ్డ కవితను జైల్లో పెట్టారని, సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా ఆయన పార్టీ పరిస్థితిపై స్పందించారు. ‘‘ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే, పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నాను. అందరూ అనుకున్నట్టుగా పార్టీలో ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించాం. మళ్లీ మనం అధికారంలోకి వస్తాం. అంతెందుకు నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారు. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బీఆర్‌ఎస్‌ను అబాసుపాలు చేసే పనిలో ఉన్నారు’’ అని పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నారు. కాగా, తాను అసెంబ్లీకి వస్తానని కేసీఆర్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో చెప్పినట్టుగా తెలిసింది. ఆయన బడ్జెట్ నాడు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే మీడియాకు లీకులు ఇచ్చాయి.
తలసాని గైర్హాజరు
కేసీఆర్ నిర్వహించిన ఎల్పీ మీటింగ్‌కు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఉదయం గన్‌పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులర్పించేందుకు కూడా ఆయన రాలేదు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్‌రాంరెడ్డి కూడా సమావేశానికి అటెండ్ కాలేదు. మాణిక్‌రావు హాస్పిటల్‌లో ఉండడం వల్లే రాలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే, సమావేశానికి రాలేకపోయిన ఎమ్మెల్యేలు తమకు ముందే సమాచారం ఇచ్చారని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకొచ్చారు. కానీ తలసాని ఉదయం అసెంబ్లీకి హాజరై, మధ్యాహ్నం జరిగిన ఎల్పీ మీటింగ్ గైర్హాజరవడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.