బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ పోటాపోటీ కార్యక్రమాలు.. మల్లంపల్లి క్రెడిట్‌‌ కోసం పార్టీల ఫైట్​

బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ పోటాపోటీ కార్యక్రమాలు.. మల్లంపల్లి క్రెడిట్‌‌ కోసం పార్టీల ఫైట్​
  • బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ పోటాపోటీ కార్యక్రమాలు

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌‌ విడుదల చేయడంతో క్రెడిట్‌‌ దక్కించుకునేందుకు బీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మేం కొట్లాడితేనే మండలం ఏర్పాటైందని ఒకరంటే.. లేదు మా లీడర్ల కృషితోనే సాధ్యమైదంటూ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. 

బీఆర్‌‌ఎస్‌‌ ర్యాలీ, క్షీరాభిషేకం

మల్లంపల్లిని మండలం చేయడాన్ని హర్షిస్తూ ములుగు జడ్పీ చైర్‌‌పర్సన్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి, బీఆర్‌‌ఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించి అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మల్లంపల్లి మండలం కోసం జడ్పీ మాజీ చైర్మన్‌‌ కుసుమ జగదీశ్‌‌ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారని చెప్పారు. 

ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి పరిపాలనా వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌‌ఎస్‌‌ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, సర్పంచ్‌‌ చందా కుమారస్వామి, ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్, చందా చక్రపాణి పాల్గొన్నారు.

పోరాట ఫలితమే..

మల్లంపల్లిని మండలం చేయాలని 2016లో ములుగు జిల్లా ఉద్యమ టైంలోనే తాను పాదయాత్ర చేశానని ఎమ్మెల్యే సీతక్క గుర్తు చేశారన్నారు. ఆదివారం మల్లంపల్లిలో ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు. ఇక్కడి ప్రజలు కలిసికట్టుగా పోరుబాట పడితేనే మండల సాధ్యమైందన్నారు. 

సోషల్‌‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మల్లంపల్లి మండలం కోసం అసెంబ్లీలో తాను మాట్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గొల్లపెల్లి రాజేందర్‌‌గౌడ్‌‌, ఎండీ.చాంద్‌‌ పాషా, గోల్కొండ రవి, ప్రశాంత్‌‌ పటేల్‌‌ పాల్గొన్నారు. 

రాజకీయ, ప్రజాసంఘాల నేతలకు థాంక్స్‌‌

మల్లంపల్లి మండలం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న రాజకీయ, ప్రజా సంఘాల నాయకులకు, అధికారులకు మండల సాధన జేఏసీ అధ్యక్షుడు గోల్కొండ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల బాగోగుల కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని పోరుబాట పట్టినట్లు చెప్పారు. 

రాస్తారోకోలు, ధర్నాలు, నిరవధిక దీక్షలు, పాదయాత్రలు చేసి మల్లంపల్లి మండలాన్ని సాధించుకున్నామని, ఇందుకు అన్ని పార్టీల లీడర్లు సహకరించారని అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా మండల సాధన కోసం కృషి చేసిన వారిని ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్‌‌ సన్మానించారు. 

మల్లంపల్లి మండలంపై అభ్యంతరాలు చెప్పండి

ములుగు జిల్లా మల్లంపల్లి మండల ప్రకటనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. మల్లంపల్లిని కొత్త మండలం చేస్తూ ప్రభుత్వం గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చిందని, ఈ విషయంపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే 15 రోజుల్లో లిఖితపూర్వకంగా కలెక్టరేట్‌‌లో అందజేయాలని పేర్కొన్నారు.