
- క్షణాల్లో చేరవేస్తున్న ఆ నలుగురు ఆఫీసర్లు
- గతంలో ఉత్తర తెలంగాణలో పనిచేసిన వారి పనే?
- విధులను విస్మరించి కొత్త కుట్రలకు తెర?
- కోవర్టు అధికారులపై హెడ్ క్వార్టర్స్ ఆపరేషన్!
హైదరాబాద్: సర్కారు ఏం చేయబోతోంది.? ఏ మంత్రి ఎటు వెళ్తున్నారు..? ఎవరిని.. ఎవరు.. ఎప్పుడు..ఎందుకు కలుస్తున్నారు.. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ లీడర్లకు క్షణాల్లో తెలిసిపోతోంది. గతంలో ఉత్తర తెలంగాణలో విధులు నిర్వర్తించిన నలుగురు ఉన్నతాధికారులు ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్టు మాజీ మంత్రులకు, గులాబీ పెద్దలకు చేరవేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టుల్లో పనిచేసిన వారే ఈ కోవర్ట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని సమాచారం. విధులను పక్కన పెట్టి ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన రహస్యాలను బయటకు చేరవేస్తుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడిన అధికారులు ప్రస్తుతం కోవర్టు డ్యూటీ చేస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ నలుగురు పోలీస్ అధికారులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌లోని కొంత మంది సిబ్బందిపై హెడ్‌క్వార్టర్స్ నిఘా పెట్టింది. వారి కదలికలపై ఎప్పటిప్పుడు వివరాలు సేకరిస్తోంది.
ఆ నలుగురు ఎవరు?
బీఆర్‌ఎస్ పార్టీకి నమ్మిన బంటులుగా పేరున్న పోలీస్ అధికారులు ఇప్పటికీ ఆ పార్టీ లీడర్లతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్లలో చాలా మందిని అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసింది. వీళ్లలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పనిచేసిన నలుగురు అధికారులు ఈ కోవర్ట్ ఆపరేషన్ కు తెరలేపినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ లీడర్లతో రహస్యంగా సమావేశమవుతూ కీలక రహస్యాలు బయటపెడుతున్నారని పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. వీళ్లు డ్యూటీలో జాయిన్‌అయిన నాటి నుంచి విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఈ కార్యక్రమాలకే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని ఆ శాఖ అధికారులే చెబుతుండటం గమనార్హం.
కుట్రలకూ పాల్పడుతున్నారా?
ప్రధానంగా ఆరు గ్యారెంటీల స్కీమ్‌అమలుపై కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా పోలీస్ సర్వీసెస్ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని డీజీ కార్యాలయం గుర్తించింది.ఇందులో పోలీస్‌స్టేషన్ స్థాయి నుంచే బీఆర్‌ఎస్ అనుకూలమైన సీఐ,ఎస్‌ఐల వివరాలను సేకరించింది. గత ప్రభుత్వంలో వారిపై వచ్చిన ఆరోపణలు,ఇంటెలిజెన్స్‌అధికారుల రిపోర్ట్ ఆధారంగా అంతర్గత విచారణ జరుపుతున్నది.కోవర్టులుగా పనిచేస్తున్న అధికారులపై పటిష్టమైన నిఘా పెట్టింది. అనుమానిత అధికారుల ఆఫీసులకు వచ్చే విజిటర్స్ వివరాలను సేకరిస్తున్నది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ముఖ్యనేతలపైనా ప్రత్యేక ఇంటెలిజెన్స్ టీమ్‌తో నిఘా పెట్టినట్లు తెలిసింది.