
- కేసీఆర్, కవిత, హరీశ్ కూడా సైలెంట్
- కేటీఆర్ ఆదేశాలను పట్టించుకోని లీడర్లు, క్యాడర్
- గ్రేటర్లో అరకొర జనాలతో ధర్నాలు
- ప్రతిపక్షంగా మొదటి కార్యక్రమమే ఫెయిల్
హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను ఫ్రీగా అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బుధవారం చేపట్టిన ధర్నా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలంటూ పిలుపునిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ధర్నాలో పాల్గొనలేదు. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కవిత కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ హరీశ్, కవిత ధర్నాలో పాల్గొనలేదు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, క్యాడర్ సైతం ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. ధర్నా చేశామంటే చేశాం అన్నట్టుగా అరకొర జనాలతో మొక్కుబడిగా కార్యక్రమాన్ని నడిపించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆఫీసులే ధర్నాకు ప్రధాన కేంద్రాలు అని, ఈ రెండు చోట్ల పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని నాలుగు రోజుల క్రితమే కేటీఆర్ ప్రకటించారు. ఆయన హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తీరా చూస్తే జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద ధర్నాలో కనీసం వంద మంది కూడా పాల్గొనలేదు.
అక్కడ నిరసనకారుల కంటే, పోలీసుల సంఖ్యే ఎక్కువగా కనిపించింది. దీంతో ప్రతిపక్షంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ చేపట్టిన తొలి నిరసన కార్యక్రమమే ఇలా ఫెయిల్ అవ్వడం పట్ల పార్టీ శ్రేణులు ఆందోళనలో మునిగాయి. కాగా, ఈ ధర్నాలకు కొనసాగింపుగా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఇతర ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పార్టీ ప్రకటించింది.
ఫ్రీగా అమలు చెయ్యాలె..
జీహెచ్ఎంసీ వద్ద జరిగిన నిరసనలోఎమ్మెల్సీలు మధుసూదనచారి, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఎల్ఆర్ఎస్ అమలుపై కాంగ్రెస్ మాట తప్పిందని ముఠా గోపాల్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఫ్రీ గా అమలు చేయాలని గతంలో కాంగ్రెస్ కోర్టుకు వెళ్లిందని, మరి ఇప్పుడెందుకు చేయడంలేదని కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు. మంత్రులు, ఉత్తమ్, సీతక్క, భట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని గోపీనాథ్ అన్నారు.
అలాగే హెచ్ఎండీఏ ఆఫీసు వద్ద జరిగిన ధర్నాలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ ను ఫ్రీగా అమలు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. అయితే, గ్రేటర్ లో16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వద్ద ధర్నాల్లో నలుగురు ఎమ్మెల్యేలే పాల్గొన్నారు. కొన్నిచోట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసుల వద్ద నిర్వహించిన ధర్నాల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 54 మంది కార్పొరేటర్లకుగాను10 మందే పాల్గొన్నారు. మొత్తానికి పార్టీ ఇచ్చిన పిలుపుని ఎమ్మెల్యేల నుంచి మొదలుపెడితే కార్పొరేటర్ల వరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోనట్టు కనిపించింది.