బీఆర్ఎస్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు చిచ్చు..మాజీ మేయర్ vs మేయర్

బీఆర్ఎస్ లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు చిచ్చు..మాజీ మేయర్ vs  మేయర్
  •     నిధుల వినియోగంపై ఏసీబీ,   సీబీఐ ఎంక్వైరీకి మాజీ మేయర్ డిమాండ్ 
  •     ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై మరొకరి ఆరోపణలు
  •     అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ లో ముదురుతున్న కుమ్ములాటలు

కరీంనగర్, వెలుగు:  స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులపై విజిలెన్స్ తనిఖీలు బీఆర్ఎస్ లో చిచ్చురేపాయి. కరీంనగర్ సిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందంటూ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేయడం, వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి పరోక్షంగా మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మేయర్ సునీల్ రావు రవీందర్ సింగ్ నే టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం, ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. 

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు

2018లో కరీంనగర్‌‌కు కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ హోదా రాగా, ఏడాదిన్నర తర్వాత పనులు ప్రారంభించారు. ప్రాజెక్టులో భాగంగా రూ.934 కోట్ల విలువైన పనులు చేపట్టాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా... మరికొన్ని పెండింగ్​లో ఉన్నాయి. పూర్తయిన పనులకు సంబంధించి రూ.514 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.269.50 కోట్ల చొప్పున భరించాయి. మరో రూ.196 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు గతంలోనే అప్పటి సర్కారు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే, ఈ ఫండ్స్​చెల్లింపుల్లో అవినీతి జరిగిందని, చాలాచోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్లు రూ.కోట్లు డ్రా చేశారని, సిటీలో ఖర్చు చేయాల్సిన నిధులతో గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేశారని రవీందర్ సింగ్ ఆరోపించారు. తాజాగా విజిలెన్స్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని కొత్త రోడ్లు వేస్తున్నారని, ప్యాచ్ వర్క్ లతో కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  ఇకనుంచి కార్పొరేషన్ పరిధిలో చేసే పనులను అన్ లైన్ లో కాకుండా ఫీల్డ్​లెవెల్​లో సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఎంబీలు రికార్డు చేయాలని కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  

రవీందర్ సింగ్ పై మేయర్ ఫైర్..

రెండు రోజులుగా కార్పొరేషన్ లో అవినీతి జరుగుతోందంటూ మాజీ మేయర్ రవీం దర్ సింగ్ ఆరోపణలు చేస్తుండడంతో మేయర్ సునీల్ రావు గురువారం కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిజాయితీగా పని చేస్తుంటే... రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని, నిధులు చేతులు మారాయని  నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. పనులు మొదలై నాలుగేండ్లవుతోందని, రవీందర్ సింగ్ ఇన్ని రోజులు ఎక్కడ నిద్ర పోయారని ఎద్దేవా చేశారు. రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కార్పొరేటర్ గా, సివిల్ సప్లయీస్​ చైర్మన్ గా జోడు పదవుల్లో ఉంటూ రెండు జీతాలు తీసుకున్న అవినీతి చరిత్ర రవీందర్ సింగ్​ది అని విమర్శించారు. దీంతో బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు ఎటు దారితీస్తాయోనని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతుండగా, విజిలెన్స్ తనిఖీలు ఎవరి మెడకు చుట్టుకుంటాయోనని మున్సిపల్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది.