
- కేటీఆర్‌తో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. మంగళవారం కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌కు తెల్లం వెళ్లారు. దీంతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నాడని ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే, దీన్ని తెల్లం ఖండించారు.
అసెంబ్లీ లాబీలో తనకు ఎదురుపడ్డ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా పలకరించానని, ఆ క్ర మంలో అక్కడే ఉన్న చాంబర్‌లో వెళ్లి కూర్చున్నానని తెలిపారు. ఆ సమయంలో దొంగచాటు ఫొటోలు తీసి, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్‌కు నైతిక విలువలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించుకొని ఆనందం పొందుతున్నార ని ఫైర్అయ్యారు. భద్రాచలం ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారు. తాను మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
క్లారిటీ ఇవ్వని బండ్ల
ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి మంగళవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌కు కేటాయించిన చాంబర్‌కు వెళ్లి, కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు మీడియాకు విడుదల చేశాయి. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. రుణమాఫీ కంటే ఇదే పెద్ద న్యూస్ అని అన్నారు. అయితే, దీనిపై కృష్ణమోహన్‌రెడ్డి మాత్రం స్పందించలేదు.
ఎవ్వరూ ఎక్కడికి వెళ్లరు: పొంగులేటి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నారనే ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘ఎవ్వరూ ఎక్కడికి వెళ్లరు. మా దగ్గర ప్రేమ ఉంది. మా రాజకీయం ప్రేమతో ఉంటుంది, అక్కడేముంది’’ అని అన్నారు.