ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత అందిస్తున్న అద్భుతాల్లో కృత్రిమ మేధ ( AI ) ఒకటి. అయితే ఈ టెక్నాలజీ మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో.. దుర్వినియోగానికి పాల్పడితే అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంపై తీవ్ర ఆవేదన తెలిపారు. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలకే కాకుండా.. సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ భద్రత చాలా అవసరమని స్పష్టం చేశారు.
AI వరం కాదు, శాపం..
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఏఐతో చేస్తున్న అనైతిక చర్యల పట్ల అభ్యంతరాలను వెల్లడించారు. AI ఒక వరంగానే కాకుండా, శాపంగా కూడా మారిందని తెలిపారు. టెక్నాలజీని మనం సృష్టించినప్పటికీ, దానిపై నియంత్రణ కోల్పోతున్నాం అని ఆమె అన్నారు. తన ముఖాన్ని అశ్లీలమైన లేదా అసభ్యకరమైన దుస్తుల్లో ఎడిట్ చేసిన చిత్రాలను తాను తరచూ చూస్తుంటానని, ఆ ఎడిటింగ్ ఎంత వాస్తవంగా ఉంటుందంటే, ఒక్క క్షణం పాటు ఆ ఫోటో నిజమైనదేనేమోనని తానూ సందేహించానని ఆమె చెప్పారు.
కొద్ది రోజుల క్రితం ఒక సినిమా పూజా కార్యక్రమం సందర్భంగా నేను ధరించిన దుస్తులను, నా పోజ్ లు పూర్తిగా AI ఉపయోగించి మార్చేశారని కీర్తి సురేష్ తెలిపారు.. మరొక కోణం నుంచి తీసినట్టుగా, అభ్యంతరకరంగా మార్చబడిన ఆ చిత్రాన్ని చూసి నేను షాకయ్యాను. 'నేను ఇలా పోజ్ ఇచ్చానా?' అని ఒక సెకను ఆలోచించాను. ఆ తర్వాతే అది ఫేక్ అని గ్రహించాను. ఇది నిజంగా చాలా బాధాకరం, చికాకు కలిగించే విషయం అని ఆమె తీవ్ర ఆవేదనతో పంచుకున్నారు.
డిజిటల్ భద్రత అవసరం..
కీర్తి సురేష్ ఎదుర్కొంటున్న ఈ సమస్య కేవలం ఆమె ఒక్కరిదే కాదు. 'డీప్‌ఫేక్' (Deepfake) అని పిలవబడే ఈ AI టెక్నాలజీ ద్వారా తప్పుడు వార్తలను సృష్టించడం, అశ్లీల వీడియోలలో వ్యక్తుల ముఖాలను మార్ఫింగ్ చేయడం వంటి అనైతిక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సంఘటనలు AI యొక్క ప్రయోజనాలను పక్కన పెడితే, అది ఎంతటి ముప్పుగా మారుతుందో తెలియజేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధ్యతారహితంగా AIని ఉపయోగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి హానికరమైన డిజిటల్ మార్పుల నుండి ప్రజలను రక్షించడానికి బలమైన చట్టాలు, నిబంధనలు తీసుకురావాలని ఆమె ప్రభుత్వాలను, టెక్నాలజీ సంస్థలను కోరుతున్నారు.
కీర్తి సురేష్ చివరిసారిగా తెలుగు చిత్రం 'ఉప్పు కప్పు రంబు'లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'కన్నీవెడి', 'రివాల్వర్ రీటా' వంటి ఆసక్తికరమైన తమిళ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
