తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‎లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం (నవంబర్ 20) సాయంత్రం రాష్ట్రపతి ముర్ము తిరుపతికి చేరుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎస్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి.మురళీకృష్ణ,  స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. 

అనంతరం రాష్ట్రపతి ముర్ము ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ము తిరుమలకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అనంతపురం డిఐజీ సీమోషీ ఘోష్, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం కలియుగ దైవం శ్రీవెంకట్వేశర స్వామి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (నవంబర్ 20) సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జానకీ దేవి, భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో చె. వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.