దశాబ్ద పాలన అస్తవ్యస్తం

దశాబ్ద పాలన అస్తవ్యస్తం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సుపరిపాలన జరుగుతుందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ  ప్రజలకు జరిగిన అన్యాయం తొలగిపోతుందని ఆశించిన ప్రజల ఆశయాలు గత పది సంవత్సరాలలో సాధించుకోలేకపోయాం. పేదలు, మధ్యతరగతి వారికి కావలసిన అవసరాలను పక్కన పెట్టి ప్రజల సొమ్మంతా తాయిలాలకు, పెద్ద పెద్ద ప్రాజెక్టులకు దుబారా ఖర్చు చేయడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, కేంద్రంతో, రాష్ట్ర గవర్నర్‌‌‌‌తో గిల్లికజ్జాలు వంటి వాటితో తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధి కుంటుపడింది. 

విద్యారంగాన్ని గత ప్రభుత్వం చిన్నచూపు చూసింది. రాష్ట్రంలో సుమారు 26,000 బడులున్నాయి. ఇవన్నీ సరియైన రిపేర్లకు నోచుకోక శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో చాలా గ్రామాలలో పిల్లలు చెట్లకింద చదువుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ బడులలో ఎటువంటి తాగునీటి, మరుగుదొడ్ల సదుపాయం లేక పిల్లలు ముఖ్యంగా బాలికలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్య కావలసిన దానిలో 50% మాత్రమే ఉంది. 

కొన్ని బడులలో ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు ఒకే మాస్టారు పాఠాలు చెపుతున్న పరిస్థితి ఉంది.  ప్రభుత్వబడులలో రోజురోజుకూ పిల్లల సంఖ్య తగ్గుతోంది. ఇదే సమయంలో ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లాగా  పుట్టుకొస్తున్నాయి. చివరకు 2022 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో కనీస సౌకర్యాలు కల్పించటానికి ప్రభుత్వం మన ఊరు– మనబడి, మన బస్తీ– మన బడి అనే కార్యక్రమంతో మూడు సంత్సరాలలో అన్ని బడులు బాగుచేయాలని నిర్ణయించింది. మొదటిదశలో 3,500 కోట్ల బడ్జెట్​తో 9,123 బడులను బాగుచేయాలని జీఓ. నం.4 జారీ చేయడం జరిగింది.

అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. కొన్ని స్కీములలో ఏమైనా నిధులు ఉంటే వాడుకొమ్మని చెప్పడంతో  సరియైన నిధులు లేక ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమం కుంటుపడింది. ఇకపోతే రాష్ట్రంలో సుమారు 1,20,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత దశాబ్దకాలంలో ఖాళీల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యావ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. పేదలు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు బడులలో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇక ఉన్నత విద్య పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఒక సందర్భంలో రాష్ట్రంలోని ఏ యూనివర్సిటికీ కూడా ఉప కులపతులు  అధ్యాపకులు లేక ఉన్నత విద్య కుంటుపడింది. దీనిపై హైకోర్టు అక్షింతలు వేస్తే తప్ప  ఉప కులపతుల నియామకాలు జరగలేదు.

ఆరోగ్యం:  గత దశాబ్ద కాలంలో ఆరోగ్యం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రంలో (మండలానికి) ఒక ఆసుపత్రి, అలాగే గాంధీ, ఉస్మానియా వంటి సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌‌‌‌ ఉన్నా  ప్రజలకు అందే సేవలు అంతంత మాత్రమే. డాక్టర్లు, నర్సుల కొరత, మందుల కొరత, ఆసుపత్రుల నిర్వహణలో లోపాలతో ప్రజలకు, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోయింది. కరోనా సమయంలో పేదలు పుస్తెలు అమ్ముకొని ప్రైవేటు ఆసుపత్రులలో వైద్యం చేయించుకొన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. అంతెందుకు, రాజకీయ నాయకులు జబ్బు పడ్డప్పుడు కార్పొరేట్‌‌‌‌ ఆసుపత్రులనే ఆశ్రయించారు కానీ ఒక్కరంటే ఒక్క శాసన సభ్యుడు, మంత్రులు  ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేదు. మన పాలకులకు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ఉన్న నమ్మకం ఏపాటిదో ఇది చెప్పకనే చెపుతోంది. కొన్ని సర్వేల ప్రకారం పేదలు తమ ఆదాయంలో 25శాతం వరకు ఆరోగ్యసేవలకే ఖర్చు పెడుతున్నారు.

నిర్లక్ష్యానికి గురైన పంచాయతీ వ్యవస్థ: మన మూడంచెల పాలనా వ్యవస్థలో పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజలకు పౌరసేవలు అందిస్తాయి. ముఖ్యంగా తాగునీరు, రోడ్డు, డ్రైనేజి వ్యవస్థ, వీధి దీపాలు, పార్కులు వంటివి. అయితే గత పది సంవంత్సరాలలో గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం అధికార పార్టీ శాసన సభ్యుల అధీనంలోకి వెళ్లింది.  గ్రామంలో ఏ చిన్న పనికైనా శాసన సభ్యుడి అనుమతి కావలసిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగం ఆర్టికల్‌‌‌‌ 280 ప్రకారం  కేంద్ర ఆర్థిక సంఘం పన్నుల వాటాను కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపకం చేస్తోంది. 

అదేవిధంగా రాష్ట్ర ఆర్థికసంఘం రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పంచాలి.  ప్రతినెలా కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బు అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంచాయతీలకు రాష్ట్ర ఆర్థికసంఘం సూచించిన విధంగా డబ్బు విడుదల చేయడం లేదు. దానితో చాలా గ్రామ పంచాయతీల్లో పనులు జరిగినా డబ్బులు లేక చాలామంది సర్పంచులు ఇబ్బందులు పాలవుతున్నారు. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదేవిధంగా ఉంది. బీహెచ్‌‌‌‌ఎంసీలో ఉద్యోగస్థుల జీతభత్యాలు సరియైన సమయంలో ఇచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్, వరంగల్‌‌‌‌ వంటి నగరాలలో రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.

నీళ్లు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమించడం జరిగింది. ప్రభుత్వం ఈ దిశగా ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు మొదలుపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని అంచనా. కాళేశ్వరం ప్రాజెక్టులో బేషజాలకు పోయి మితిమీరిన ఖర్చు చేయడంతో ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి 7 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. దీనికి తోడు  విద్యుత్‌‌‌‌, ఇతర ఖర్చులు ఎకరానికి సాలీనా 15 వేల పైనే ఉంటుంది. వంద సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టు పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 30 వేల కోట్లతో మొదలై ఇప్పుడు అంచనా 50 వేల కోట్లకు దాటింది.  పని మధ్యలోనే ఉండగా పక్క రాష్ట్రంతో ఇబ్బందులు, రకరకాల కోర్టు కేసులతో అది ముందుకుసాగడం లేదు.

ఆర్థిక క్రమశిక్షణ లోపించడం: గత పది సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో చూపించిన అంకెలకు ఖర్చు అయిన అంకెలకు ఎక్కడా పొంతనలేదు. అసెంబ్లీలో వివిధ శాఖలకు పద్దులపై సరియైన చర్చ జరగకపోవడం,  అంతా ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలే కావడంతో గందరగోళం ఏర్పడింది. ఓట్ల వేటలో కొత్త స్కీములు మొదలుపెట్టడంతో ఖర్చు తడిసి మోపెడైంది. స్కీముల కోసం అందిన కాడికి అప్పులు చేయడంతో రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పులో ఉంది.

నియామకాలు:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిపిన పోరాటంలో నియామకాల అంశం ప్రధానమైనది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించారు. ఉద్యోగ ఖాళీలున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. చివరకు రాష్ట్ర పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌లో జరిగిన తతంగం నిరుద్యోగులను ఎంతో కలవరపెట్టింది.

అడ్వైజర్ల నియామకాలు: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌ అధికారులకు పదవీ విరమణ అనంతరం వారినే మళ్లీ అడ్వైజర్లుగా నియమించింది. వారితో చట్టాలకు విరుద్ధంగా ఎన్నో పనులు చేయించుకొంది.  చీఫ్‌‌‌‌ సెక్రటరీ, డీజీపీ స్థాయి అధికారులు పదవీ విరమణ పొందిన తరువాత అడ్వైజర్లుగా పని చేస్తూ పెద్ద ఎత్తున జీతభత్యాలు, బంగ్లా, కారు, సిబ్బంది పొందారు. ఈ విధంగా ఉన్నతాధికారులను ప్రలోభాలకు గురిచేయడం వారు అధికారపార్టీకి వంతపాడడం జరిగింది.

పారదర్శకత లేని పాలన: ప్రభుత్వ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ప్రభుత్వ జీఓలు,  ఇతర ప్రభుత్వ ముఖ్యమైన నిర్ణయాలు ఉంచాలి. కానీ, అలా జరగలేదు. ప్రభుత్వపాలన అంతా గుప్తంగా సొంత ఆస్తిలాగా జరిగింది. కొన్ని ప్రాజెక్టు పనులలో రాత్రికి రాత్రి తమవారికి సహాయం చేయడానికి ఎస్టిమేట్‌‌‌‌ ధరలు పెంచడం వంటివి చేసినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.

 మొక్కుబడిగా శాసనసభ సమావేశాలు : రాష్ట్ర శాసనసభ సమావేశాలు సరిగా జరగలేదు. బీఆర్ఎస్​ ప్రభుత్వ చివరి అసెంబ్లీ సమావేశం 4 రోజులు జరిగింది. అందులో మొదటి రోజు 5 అంటే 5 నిమిషాలు దివంగత శాసనసభ్యునికి నివాళులు అర్పించి సభ వాయిదా పడింది. ఇక రెండో రోజు ఒక మంత్రి ఉపన్యాసం, మూడోరోజు ఇంకొక మంత్రి ఉపన్యాసం, చివరిరోజు ముఖ్యమంత్రి  సుదీర్ఘ ఉపన్యాసంలో తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, తెలంగాణ దేశానికే రోల్​ మోడల్‌‌‌‌ అని సందేశం ఇవ్వడం జరిగింది. మధ్యలో ప్రతిపక్ష సభ్యులు ఏదైనా మాట్లాడినా దానిని వెంటనే ఖండించడం ఇంకా మాట్లాడితే  ప్రతిపక్షాల సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్‌‌‌‌ చేయడం వంటివి జరిగాయి.   అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గ్రామాలలో రచ్చబండ వద్ద జరిగే పంచాయితీలు బేషుగ్గా ఉ౦టాయనిపిస్తోంది.

బెల్టుషాపులు: తెలంగాణ ఏర్పడేనాటికి ఆబ్కారీ ఆదాయం 8 వేల కోట్లు ఉండగా అది నేడు 40 వేల కోట్లకు చేరింది. ప్రభుత్వం మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహించింది. అధికారులకు టార్గెట్లు పెట్టి ప్రజలు అధికంగా  తాగే పరిస్థితి తెచ్చింది. భారత రాజ్యాంగం ఆర్టికల్​ 47లో రాష్ట్రం మద్య నియంత్రణ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నదానికి విరుద్ధంగా గ్రామాల్లో బెల్టుషాపులు తెరిచి మద్యపానం పెంచింది.

పాలనలో అవినీతి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాజకీయ అవినీతి, అలాగే పాలనలో (ఉద్యోగస్థుల) అవినీతి పెరిగింది. ప్రస్తుతం ఒక పౌరుడు తనకు కావాలిసిన ప్రభుత్వ పనులు పొందాలంటే లంచం ఇవ్వనిదే  జరగడంలేదు. ఇక శాసనసభ్యుల, మంత్రుల అవినీతి చిట్టా కూడా చాలా పెద్దగా ఉంది.

విద్యుత్‌‌‌‌శాఖ అప్పు రూ.85 వేల కోట్లు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి కావలసిన విద్యుత్‌‌‌‌లో సగం మాత్రమే అందుబాటులో ఉండేది. తరచుగా సరఫరా ఆగిపోవడంతో వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇబ్బందులు కలిగినాయి. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. పాలకులు రెప్పపాటు కూడా కరెంటు కోతలుండవని ప్రతి మీటింగులో చెప్పారు.  జరిగింది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 

ఇంతవరకు విద్యుత్‌‌‌‌ ప్లాంట్లపై 50 వేల కోట్ల వరకు ఖర్చు చేసినా 10 ఏండ్ల తరువాత కూడా మనకు కావలసిన కరెంటును రాష్ట్రం ఉత్పత్తి చేయలేక 30శాతం వరకు బయటి రాష్ట్రాల నుంచి అధిక ధర పెట్టి కొనవలసిన పరిస్థితి ఏర్పడింది.  విద్యుత్‌‌‌‌ శాఖ 85 వేల కోట్ల రూపాయల పీకల్లోతు అప్పుల్లో ఉన్నా ప్రజలకు మాత్రం 24 గంటలు కరెంటు ఇస్తున్నామంటూ ప్రగల్భాలు పలికారు. వీటన్నింటినీ పరిశీలిస్తే  ఏ ఉద్ధేశ్యంతోనైతే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నామో అది జరగలేదని స్పష్టం అవుతోంది. గత 10 సంవత్సరాలలో పాలన అంతా అస్తవ్యస్తమైంది.  సుసంపన్నంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

ఎం. పద్మనాభరెడ్డి, ఫోర​మ్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​