
రేగొండ, వెలుగు: రైతులకు యూరియా తక్షణమే అందించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రేగొండ మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి క్యూలైన్లో ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
రైతు సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్, కొత్తపల్లి గోరి మండలాధ్యక్షుడు హమీద్, నాయకులు కొలెపాక భిక్షపతి, కొల్గూరి రాజేశ్వర్‌రావు, ప్రశాంత్‌రావు, తడక శ్రీకాంత్, మాడగాని నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు(గోవిందరావుపేట),వెలుగు: యూరియా ను వెంటనే పంపిణీ చేయాలని వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు ఆందోళన చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ఆదివారం రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వారం రోజులుగా యూరియా బస్తాలు దొరకడం లేదని, అధికారులు బస్తాలు తెప్పిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
వెంటనే యూరియా బస్తాలు తెప్పించి రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు పస్రా ఎస్సై కమలాకర్, సిబ్బందితో కలిసి వెళ్లి మాట్లాడి యూరియా ఇప్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, నాయకులు అజ్మీర సురేశ్, మాలోత్ గాంధీ, అక్కినపల్లి రమేశ్, బైకాని ఓదెలు, పోరిక స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.