ఆత్మరక్షణలో బీఆర్ఎస్​.. పశ్చాత్తాపం ఇప్పుడే ఎందుకు?

ఆత్మరక్షణలో బీఆర్ఎస్​.. పశ్చాత్తాపం ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర శాసనసభకి జరిగిన గత రెండు ఎన్నికలలోనూ కేసీఆర్​ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి సునాయాసంగానే విజయం సాధించింది. మూడోసారి జరగబోతున్న ఎన్నికలలో  మాత్రం గెలుపు కోసం బీఆర్ఎస్​ నాయకులు చెమటోడ్చక తప్పటం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  ప్రధానంగా నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ ఉండటం  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు పాలక  బీఆర్ఎస్  వైఫల్యాలను ఎండగడుతున్నాయి.  

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సర్కారు  వైఫల్యం, పేపర్ లీకేజ్ వ్యవహారం, పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో వైఫల్యం,  పెద్ద రైతులకి, భూస్వాములకు రైతుబంధు ఇవ్వటం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. అదేవిధంగా  ధరణి పోర్టల్​లో తప్పులు లాంటి వాటిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్న సందర్భంలో  ప్రభుత్వ వైఫల్యాలపై  ప్రజల నుంచి ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అదేరీతిలో  పేదలు, రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కూడా పసిగట్టిన బీఆర్ఎస్ అగ్ర నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. బహిరంగ సభలలో, చర్చా కార్యక్రమాలలో తమ వైఫల్యాలను ఒప్పుకుంటూ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత  మెరుగైన చర్యలు చేపడతామని హామీ ఇస్తున్నారు. 

వివక్షే ఉద్యమానికి పునాది

నిధులు, నీళ్లు, నియామకాలలో జరిగిన వివక్షే  తెలంగాణ ఉద్యమానికి  పునాదైనది.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకి వస్తాయని, ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని నాటి ఉద్యమ నాయకత్వం నమ్మబలికింది. కానీ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో  ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్​లు విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై యువతలో వ్యతిరేకత పెరిగింది.  2 లక్షల 32వేల ఖాళీలను గుర్తించామని.. ఇప్పటివరకూ 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేశామనే  ప్రభుత్వ ప్రకటనలను విద్యార్థులు, నిరుద్యోగులు విశ్వసించటం లేదు. 2022 మార్చి 9న ముఖ్యమంత్రి  కేసీఆర్ శాసనసభ సాక్షిగా 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించినా ఎన్నికల నాటికి ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేకపోవటం ప్రభుత్వ వైఫల్యంగానే యువత భావిస్తున్నది. మరోవైపు ప్రధానంగా టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షలను నిర్వహించడంలో వైఫల్యం, పేపర్ లీకేజ్, పరీక్షల వాయిదాలతో యువత  నిస్తేజానికి గురైంది.  నోటిఫికేషన్​ల విడుదలలో జరిగిన జాప్యం వల్ల  నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ మరణం, పేపర్ లీకేజీతో పరీక్షలు వాయిదాలతో మనస్తాపం చెంది ప్రవళిక ఆత్మహత్య ఆ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ముఖ్యంగా కేటీఆర్ వ్యవహార శైలి, వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించాయి. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2019–- 20 బడ్జెట్​లో 1,810 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టడంతో నిరుద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.

డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల  కేటాయింపులో అవకతవకలు

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మరో ప్రధాన వైఫల్యం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 28 లక్షల మంది ఇల్లు లేని పేదలు దరఖాస్తు చేసుకున్నారు.  ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మంజూరైనవి 2,76,912 ఇండ్లు.  వీటిలో పూర్తి అయినవి కేవలం 1,28,920 మాత్రమే. 2018లో ఎన్నికల సందర్భంగా సొంత భూమి ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని మాట తప్పడం,  గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం వలన  పేద ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2023–24 రాష్ట్ర బడ్జెట్​లో ఇండ్ల నిర్మాణానికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయించినా ఖర్చు చేయలేదు.  కానీ, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, జిల్లాలలో పార్టీ ఆఫీసులు, సచివాలయాన్ని కూల్చివేసి వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయ నిర్మాణం, ప్రగతి భవన్ వంటివి ఆగమేఘాల మీద నిర్మించుకున్నార నే అసంతృప్తి పేదవర్గాల్లో ఏర్పడింది.

 అనర్హులకు రైతుబంధు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. పెద్ద రైతులకు, భూస్వాములకు, పంటలు పండని భూములు ఉన్న యజమానులకు కూడా లక్షలాది రూపాయలను రైతుబంధు రూపంలో అందజేశారని,  తెలంగాణ రాష్ట్రంలో  ఐదు నుంచి 25 ఎకరాలకిపైన ఉన్న రైతులు 6.99 లక్షల మంది ఉన్నారు.  వారికి కూడా కోట్లాది రూపాయలను  రైతుబంధు పేరిట ఇవ్వొద్దనే ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.  అనర్హులకు కూడా  రైతుబంధుని కొనసాగించడం విమర్శల పాలైంది.  ధరణి పోర్టల్ వలన ఎదురైన సమస్యలను పరిష్కరించకపోవడం వలన లక్షలాది మంది రైతుల నుంచి ప్రభుత్వంపై  తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.  ప్రతిపక్షాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో  ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం,  మొదటి సంవత్సరంలోనే  రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం,  టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం,  నిరుద్యోగ భృతి ఇస్తాం, ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామనే హామీలు ప్రకటించడంతో మెజార్టీ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు. 

ఆత్మరక్షణలో బీఆర్ఎస్​

ప్రతిపక్షాల హామీలతో అధికార బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేసీఆర్,  కేటీఆర్​ తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెపుతున్నారు. మిషన్ మోడ్​లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామని, ధరణిలో తప్పులను సరి చేస్తామని, రైతుబంధు అమలులో ట్రిమ్మింగ్ చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు.  కానీ, ప్రజలు వీరి మాటలను ఎంతవరకు విశ్వసించారనేది  ఎన్నికల అనంతరం తేలిపోనుంది.  నిరుద్యోగులు, ఇల్లు లేని పేదలు,  దళిత బంధు అందనివారు,  ధరణితో  సమస్యలు ఎదుర్కొన్న రైతులు అధికార బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారనేది వాస్తవం.  ఈ అసంతృప్తి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోతున్నది అనేది కూడా నిజం. పాలకులు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేయాలే కానీ.. వారే ప్రజలకు సమస్యగా మారకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం రేపటి ఎన్నికలలో  భారీ మూల్యం చెల్లించుకోబోతుందనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నది.  పదేండ్ల పాలన తర్వాత  వైఫల్యాల పట్ల ఇప్పుడు  పాలకులు పశ్చాత్తాప పడటం అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. అధికారం శాశ్వతం కాదని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ, అధికారాన్ని వదులుకోవడానికి  ఏ నాయకుడైనా  స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అందుకే అధికారం పరమపద సోపానం అని పాలకుడు గుర్తిస్తే  ప్రజల పక్షాన ప్రజల మనోగతం గుర్తెరిగి పాలన చేయాలి. అట్లాంటి పాలనను తెలంగాణలో  పాలకులు అందిస్తే  ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి.

- డాక్టర్ తిరునహరి శేషు, పొలిటికల్​ ఎనలిస్ట్