తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ మంచిది కాదు

తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ మంచిది కాదు
  • లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయాలి: ఎంపీ అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్​పార్టీ సమాజానికి మంచిది కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని బొందపెట్టారని, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకంగా భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ గత పదేండ్లు తెలంగాణకు చీడపురుగులా పట్టిందన్నారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. రెండు దర్యాప్తు సంస్థలతో అరెస్టైన కవిత.. దాదాపు 4 నెలలుగా జైల్లో ఉన్నారన్నారు. కవితను బయటకు రాకుండా కేటీఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని ఎంపీ అర్వింద్ అన్నారు. 

గత పదేండ్లలో తెలంగాణలో అసలు అసెంబ్లీ సమావేశాలే జరగలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని పార్టీల వాయిస్ సభలో వినపడుతోందని చెప్పారు. అతిగా నీలిగారు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ కొవ్వు కరిగించారని విమర్శించారు. బంతికన్నా వేగంగా మార్షల్స్ కేటీఆర్ ను అసెంబ్లీ నుంచి బయటకు ఎత్తిపడేశారని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ అవినీతిపై చర్యలేవి? 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పౌరుషం ఏమైందన్నారు. టైం పీరియడ్ లేని కమిషన్లు వేయడం ఎందుకని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తే.. బీఆర్ఎస్ తో ఎవరు కాంప్రమైజ్ అయ్యారో తెలుస్తున్నదన్నారు. తెలంగాణ బీజేపీ నేతల్లో ఐక్యత ఉందని అర్వింద్ చెప్పారు. 

రైతు రుణమాఫీ పూర్తయ్యాక ఆ డేటా తీసుకుని స్పందిస్తామన్నారు. అలాగే, ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు. కేంద్ర బడ్జెట్ ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు.. రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీకి నిధులు తగ్గించి, మైనార్టీలకు అధిక కేటాయింపులు చేయడంపై ఎందుకు నోరుమొదపడం లేదన్నారు. అధ్యక్ష పదవికి బీజేపీలో రేసులు ఉండవని... ఆ విషయంలో తన నిర్ణయాన్ని అధిష్టానం ముందు చెప్తానన్నారు. బీజేపీ ఎప్పుడు కుల రాజకీయాలు చేయదని... కులాల ఆధారంగా పార్టీ చీఫ్ ను నియమించదని అర్వింద్​స్పష్టం చేశారు.