
షాద్ నగర్, వెలుగు : తన జాగాలోంచి సీసీ రోడ్డు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించిన ఓ మహిళను బీఆర్ఎస్ కు చెందిన వార్డు మెంబర్ తిట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన పాలేపల్లి లక్ష్మమ్మ (54)కు చెందిన ఇంటి కంపౌండ్ వాల్‌ను తాకుతూ సీసీ రోడ్డు వేస్తున్నారు. దీంతో తన జాగా నుంచి రోడ్డెందుకు వేస్తున్నారని మంగళవారం ఉదయం బీఆర్ఎస్ వార్డు మెంబర్ తబ్రేజ్‌ను లక్ష్మమ్మ ప్రశ్నించింది. సర్కారు జాగా నుంచే రోడ్డు వేసుకోవాలని సూచించింది. అయితే, కచ్చితంగా రోడ్డు వేసి తీరతానని ఆయన ఖరాకండిగా చెప్పడంతో పాటు, లక్షమ్మ కుటుంబసభ్యులతోనూ గొడవ పెట్టుకున్నాడు.
తబ్రేజ్‌తో పాటు ఆయన వెంట ఉన్న మరికొందరు లక్ష్మమ్మను బూతులు తిట్టారు. దీంతో అందరి ముందు అనకూడని మాటలన్నారని, పరువు పోయిందని మనస్తాపానికి గురైన లక్ష్మమ్మ సాయంత్రం టైంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. లక్ష్మమ్మ భర్త అంజయ్య కాపాడడానికి ప్రయత్నించగా మంటలంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. లక్ష్మమ్మ అక్కడికక్కడే చనిపోయింది. అంజయ్యను షాద్నగర్సర్కారు దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ రంగస్వామి గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెటింగ్ఏర్పాటు చేశారు. ఈ కేసులో తబ్రేజ్‌ను అరెస్ట్ చేశామని, మరో మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఏసీపీ రంగస్వామి ప్రకటించారు.
కుటుంబసభ్యులకు కాంగ్రెస్ పరామర్శ
లక్షమ్మ మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గ్రామానికి చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ మహిళ అని చూడకుండా లక్ష్మమ్మతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమె కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .