- ఫ్యూచర్ సిటీ అంటూ ఉహాల్లో బతుకుతున్నరు: కేపీ వివేకానంద్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. ‘‘ముందు నుంచి సిటీని ఆయన చెత్త నగరంగానే చూస్తున్నారు. ఫోర్త్ సిటీ ఊహల్లో బతుకుతున్నారు. రేవంత్ సీఎం అయ్యాక సిటీ పరిస్థితులు దిగజారాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రోను రద్దు చేశారు.
మూసీ ప్రక్షాళన పేరు చెప్పి ఎక్కడపడితే అక్కడ కూల్చివేతలు చేస్తున్నారు”అని మండిపడ్డారు. బుధవారం మరో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగితే.. అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిచ్చారని, ఆయనకు సిటీపై పూర్తి స్థాయిలో అవగాహన లేదని మండిపడ్డారు.
మహేశ్వరం, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపి వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిది పేరుకే ప్రజాపాలన.. చేస్తున్నదంతా రాచరిక పాలన అని మండిపడ్డారు. మంత్రులు, అధికారులు, మేయర్‌కు తెలియకుండా జీహెచ్‌ఎంసీలో 300 డివిజన్లు చేశారన్నారు. అసెంబ్లీలో జీరో అవర్ జీరో ఆన్సర్‌గా మారిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. అసెంబ్లీ ఈ ఏడాది 16 రోజులే నడిచిందని, సభలో తిట్లు, బూతులే ఎక్కువయ్యాయన్నారు.
