కేసీఆర్ దీక్ష చేయకపోతే .. తెలంగాణ ప్రకటన చేసే వాళ్లా? : పొన్నాల లక్ష్మయ్య

కేసీఆర్ దీక్ష చేయకపోతే .. తెలంగాణ ప్రకటన చేసే వాళ్లా? : పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే తెలంగాణపై అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేసే వారా అని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌‌లో మీడియతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుపై చిదంబరం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతోనే యువకులు బలిదానాలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ చరిత్రను చిదంబరం వక్రీకరిస్తున్నారని, నిజాలు చెప్పి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 1.95 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండేవని, ఇప్పుడు ఎన్ని ఖాళీలున్నాయో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

ఆర్బీఐ నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంటోందని, అప్పుల్లో తెలంగాణ 22వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రాజస్థాన్ ప్రభుత్వ అప్పులపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం వెయ్యి మంది కార్పొరేట్లకు చెందిన రూ.14 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. అప్పులు చేయకుండా, భూములు అమ్మకుండా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు అమలు కావని.. ప్రజలు మళ్లీ కేసీఆర్‌‌‌‌నే సీఎం చేస్తారన్నారు.