సొంత అభ్యర్థులనే బీఆర్ఎస్ను ఓడించారా?.. హాట్ టాపిక్గా శానంపూడి కామెంట్స్

సొంత అభ్యర్థులనే బీఆర్ఎస్ను ఓడించారా?.. హాట్ టాపిక్గా శానంపూడి కామెంట్స్

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీ అగ్రనాయకులే కారణమా..? ప్రత్యర్థులకు డబ్బులిచ్చి మరీ తమ పార్టీ క్యాండిడేట్లను ఓడించారా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి ఇవాళ విడుదల చేసిన ఆడియో ఈ చర్చకు తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెలుపుకోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, పార్టీ డబ్బులు ఇవ్వకున్నా సొంతడబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేశానని, మనకు ఇవ్వాల్సిన డబ్బులు అవతలివాళ్లకు ఇచ్చారంటూ సైదిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారి తీశాయి.

బీఆర్ఎస్ లో నివురుగప్పిన నిప్పులా ఇంత రాజకీయం సాగిందా..? డబ్బులు అందజేసే బాధ్యత తీసుకున్న వారెవరు..? ఎవరి డైరెక్షన్ లో ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చారు. ఇంతకూ ఎవరా ప్రత్యర్థి..? అన్నది ఆసక్తికరంగా మారింది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి చల్లా శ్రీలత, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పిల్లుట్ల రఘు, బీఎస్పీ నుంచి రాపోలు నవీన్ కుమార్, సీపీఎం నుంచి మల్లు లక్ష్మి పోటీ చేశారు. వీరిలో ఎవరికి డబ్బులు అందాయన్న చర్చ మొదలైంది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ డబ్బులు పంపదు.. పంపినా ఆయన తీసుకోరనేది తెలిసిన విషయమే. మిగతా అభ్యర్థుల్లో ఎవరికి పంపారనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ తరహా శల్య సారథ్యం ఒక్క హుజూర్ నగర్ కే పరమితమా..? రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా బీఆర్ఎస్ ఇలాంటి ఎత్తుగడలు వేసిందా..? అభ్యర్థి మీద కోపంతో అధికారానికే ఎసరు తెచ్చుకుందా..? అన్న చర్చ  మొదలైంది. ఓడిపోయిన అభ్యర్థులు ఒక సారి క్రాస్ చెక్ చేసుకునే  పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.  

ఏనుగు వెనుక ఉన్నదెవరు..?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పై బీఎస్పీ అభ్యర్థులు బరిలోకి దిగారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ కారణంగా తాము ఓడిపోయామని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపిస్తున్నారు. బీఎస్పీతో పొత్తును విభేదిస్తూ.. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీ అయ్యారు.  అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బీఎస్పీ వెనుక ఉన్నదెవరు..? ఎన్నికలు అయిపోగానే ఎందుకు ఈ రెండు పార్టీలు కలిశాయి..? అన్న చర్చ మరోమారు తెరపైకి వచ్చింది.