మహబూబ్ నగర్ కలెక్టరేట్/గద్వాల/అలంపూర్/నాగర్ కర్నూల్ టౌన్ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జనరల్ అబ్జర్వర్ కాత్యాయని దేవితో కలిసి కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
పోలింగ్, కౌంటింగ్ లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీలకు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ టీమ్ లను ఎంపిక చేశారు.
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతతో పని చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలకు సిబ్బంది సమయానికి చేరుకోవాలని, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ జాబితా పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని స్పష్టం చేశారు. అనంతరం అలంపూర్ క్షేత్రంలో ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలపై చర్చించారు. ఏర్పాట్లు పక్కగా ఉండాలని సూచించారు.
మద్యం దుకాణాలు బంద్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. 11న పోలింగ్ సందర్భంగా ఓటర్లకు వేతనంతో కూడిన పబ్లిక్ హాలిడే ప్రకటించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభమైన సీఎం క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు. స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన కలెక్టర్, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు.
