
- హైదరాబాద్‌ను కాపాడాలంటే అక్రమ కట్టడాలు కూల్చాల్సిందేనని అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యలు
- 28 వేల కట్టడాలను తొలగిస్తాం.. అడ్డుపడొద్దని హితవు
- ఇప్పుడేమో బుల్డోజర్లకు అడ్డంపడ్తానంటున్న కేటీఆర్
- హైడ్రాకు బీజేపీ ఎంపీలు రఘునందన్, అర్వింద్, కొండా మద్దతు
- మూసీ కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ మరో ఎంపీ ఈటల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీఆర్ఎస్, బీజేపీలో నాయకులు తలోమాట మాట్లాడుతున్నారు. హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీలైతే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. కూల్చివేతలపై హైడ్రా వెనక్కి తగ్గవద్దని, రాష్ట్రమంతా విస్తరించాలని ఎంపీలు రఘునందన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్లాంటివాళ్లు మాట్లాడుతుండగా, కూల్చివేతలకు వ్యతిరేకంగా సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తామని మరో ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించడం గమనార్హం. ఇక అక్రమ కట్టడాలను కూల్చేస్తే తప్ప హైదరాబాద్ మనుగడ సాగించలేదని, అందరూ కూల్చివేతలకు సహకరించాలని నాడు సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడగా, ప్రస్తుతం ఆయన కొడుకు కేటీఆర్ బుల్డోజర్లకు అడ్డంపడ్తానని అనడం మారిన పార్టీల వైఖరిని తెలుపుతున్నది. మరోవైపు ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కారు ముందుకు వెళ్తున్నది. హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి కాపాడాలంటే మూసీని ప్రక్షాళన చేయడం తప్ప.. వేరే మార్గం లేదని అంటున్నది. ప్రస్తుతానికి మూసీ ఎఫ్టీఎల్, బఫర్జోన్ల వైపు వెళ్లకుండా రివర్బెడ్(నది గర్భం) లో ఉన్న నిర్మాణాలను కూల్చడం ద్వారా నదీ మార్గాన్ని క్లియర్ చేయాలని భావిస్తున్నది. ప్రస్తుతం రివర్‌బెడ్‌లో మాత్రమే సర్వే చేస్తున్నామని, నిర్వాసితులను డబుల్బెడ్రూం ఇండ్లకు తరలించాకే పనులు మొదలుపెడ్తామని, దీనికి ప్రతిపక్షాల అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్అంటున్నారు.
ఒక్కొక్కరు ఒక్కోతీరుగా..
హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. కూల్చివేతలపై హైడ్రా వెనక్కి తగ్గవద్దని, రాష్ట్రమంతా విస్తరించాలని ఎంపీలు రఘునందన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్లాంటివాళ్లు మాట్లాడగా, కూల్చివేతలకు వ్యతిరేకంగా ఏకంగా సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తామని రాష్ట్ర సర్కారును మరో ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన అంటే తాను ఎంతో సంతోషపడ్డానని, కానీ ఆ పేరుతో పేదోళ్ల భూములు లాక్కొని పెద్దోళ్లకి ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోనన్నారు. ‘అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తాం. హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళ్తాం. మేము చూస్తూ కూర్చోం. మూసీ నది మీద పెద్ద పెద్ద బిల్డర్లు బడా బిల్డింగ్ లు కడుతున్నారు. వాటిపై చర్యలేవీ? మూసీకి అటుపక్క కిషన్ రెడ్డి, ఇటు పక్క నేను, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి నలుగురు ఎంపీలున్నాం’ అని అన్నారు. ఇక ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసినప్పుడు అక్రమ నిర్మాణాలపై ఇలాగే ముందుకు సాగాలని, ఎవరికీ తలొగ్గవద్దని ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని స్టే ఇచ్చిన హైకోర్టును సైతం ఎంపీ తప్పుపట్టారు. హైడ్రాపై మరో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏకంగా సర్వే చేశారు. తన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాతం మంది సమర్థిస్తే.. కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని సోషల్‌మీడియాలో అభిప్రాయపడ్డారు. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని, కూల్చివేతల వెనుక సీఎం రేవంత్ రెడ్డికి కక్ష సాధింపు ఏమీ లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడి అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిన విషయాన్ని కొండా గుర్తుచేశారు. ఇక తాజాగా.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సిందేనని, హైడ్రాను జిల్లాకు విస్తరించాలని నిజామాబాద్బీజేపీ ఎంపీ అర్వింద్కుమార్డిమాండ్చేశారు. దీంతో అసలు కూల్చివేతలపై పార్టీలు, నేతల స్టాండ్ ఏంటో అర్థం కాక సామాన్యులు తలపట్టుకుంటున్నారు.
కేసీఆర్ అట్ల.. కేటీఆర్ ఇట్ల..
‘హైదరాబాద్‌లో అక్రమ కట్టడం కనిపిస్తే నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తం.. అది కట్టినవాళ్లు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత పవర్ఫుల్ అయినా అక్రమ కట్టడాలు అనుమతించం. కట్టదలుచుకున్నోళ్లకు కూడా హెచ్చరిక చేస్తున్నం.. కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోవద్దు.. డబ్బులు పాడు చేసుకోకండి.. నాలాల మీద 28 వేల నిర్మాణాలు ఉన్నయ్. వాటన్నింటినీ తీసేస్తం. వీటిని కూల్చేటప్పుడు కూడా కరెక్టే కూల్చేస్తున్నం అని మీడియా పాజిటివ్‌గా తీసుకెళ్లాలి’ అని కేసీఆర్సీఎంగా ఉన్నప్పుడు అన్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌చేస్తున్నాయి. మూసీని, చెరువులను, నాలాలను చెరబట్టి హైదరాబాద్నగరాన్ని సీమాంధ్ర పాలకులు సర్వనాశనం చేశారని సీఎం హోదాలో కేసీఆర్ ఎన్నోసార్లు ఆరోపించారు. కానీ అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో మూసీ ప్రక్షాళనగానీ, చెరువులను చెరవిడిపించేందుకుగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఇలా ఉంటే, ‘హైదరాబాద్ లో ప్రజలు ఓట్లేయలేదని వాళ్లపై కాంగ్రెస్ సర్కారు పగ తీర్చుకుంటుంటే చూస్తూ ఊరుకోం. పేదవాళ్ల బతుకుదెరువుకోసం మూసీ మీద, నాలాలా మీద ఇండ్లు కట్టుకున్నారు. వాటి జోలికి వస్తే బుల్డోజర్లకు అడ్డం పడ్తం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తాజాగా మాట్లాడడం కూల్చివేతలపై మారిన బీఆర్ఎస్ స్టాండ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నది.