చేర్యాల కేంద్రంగా అధికార పార్టీలో తెరపైకి ‘స్థానికత’

చేర్యాల కేంద్రంగా అధికార పార్టీలో తెరపైకి ‘స్థానికత’
  •      జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గళం
  •      స్థానికులకే టికెట్, బీసీ అభ్యర్థి అంశాలను ముందుకు తెస్తున్న లీడర్లు 

సిద్దిపేట, వెలుగు :  సిద్దిపేట జిల్లా చేర్యాల కేంద్రంగా జనగామ నియోజకవర్గ అధికార పార్టీలో స్థానికత అంశం తెరపైకి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈసారి జనగామ టికెట్ స్థానికులకే కేటాయించాలని, బీసీ అభ్యర్థి అంశాన్ని స్థానిక నేతలు ముందుకు తెస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికే చేర్యాలలో ఆ పార్టీ సీనియర్ నేత మండల శ్రీరాములు సభ నిర్వహించారు. చేర్యాల సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో పట్టున్న నేతలు ఈసారి జనగామ బీఆర్ఎస్ టికెట్​ను దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో తామే ప్రత్యామ్నాయం అనే దిశగా వారు పావులు కదుపుతున్నారు. ఇటీవల చేర్యాల పెద్ద చెరువు వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షించడంతో ఇదే అంశాన్ని ముందుకు తెచ్చి ఎమ్మెల్యేపై తమ అసంతృప్త గళాన్ని విప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వ్యూహాత్మకంగా..

కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని ఆకాంక్షిస్తూ దుల్మిట్ట మండలానికి చెందిన పార్టీ సీనియర్ ​నేత మండల శ్రీరాములు చేర్యాలలో సభను నిర్వహించినా అక్కడ స్థానికత అంశాన్ని ముందుకు తేవడంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమాలపై విరుచుక పడడం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. చేర్యాల పెద్ద చెరువు భూ కబ్జా అంశంపై ఎమ్మెల్యేపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇటు స్థానికతతో పాటు, బీసీ అభ్యర్థి అంశాన్ని ముందుకు తెచ్చి పార్టీ కేడర్​​ను తమ వైపు తిప్పుకుంటున్నారు.

శ్రీరాములు కొంత కాలంగా నియోజకవర్గానికి అంటీముట్టనట్టుగా వుండి ఒక్కసారిగా ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంతో కలిసి చేర్యాలలో సభ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. స్థానికత అంశంతో చేర్యాలలో ప్రారంభించిన సభలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగుతాయని ఆయన పేర్కొనడం గమనార్హం. అయితే స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చి అసంతృప్త రాగం అందుకున్న శ్రీరాములు టికెట్ పోటీలో చివరి వరకు నిలుస్తాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆయన ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ అంశాన్ని తెరపైకి తేవడం ఆసక్తిని కలిగిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​రెడ్డితోపాటు ఇటు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మండల శ్రీరాములు, నాగపురి కిరణ్​ కుమార్ చేర్యాల సబ్​ డివిజన్​కు చెందినవారే కావడంతో ఆసక్తికర పరిణామాలకు చేర్యాల వేదికగా మారింది.