బీఆర్ఎస్ నేతల హంగామా..కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఉదయం నుంచే నిరసనలు

బీఆర్ఎస్ నేతల హంగామా..కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో ఉదయం నుంచే నిరసనలు
  • తెలంగాణ భవన్​లోనే పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  • సీఎం ఇల్లు, మంత్రుల క్వార్టర్స్​ ముట్టడికి ప్రయత్నాలు.. అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ​సిట్ ​విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్​ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆదివారం హంగామా చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్​ పిలుపునివ్వడంతో ఉదయం నుంచే గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో సీఎం రేవంత్​ దిష్టి బొమ్మలను దహనం చేశారు. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నందినగర్​ నివాసంతో పాటు తెలంగాణ భవన్​, ఎర్రవల్లి ఫాంహౌస్​ల వద్దకు పొద్దున్నుంచే కార్యకర్తలు వచ్చి చేరారు.

 అయితే, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్​ నందినగర్​ చేరుకున్నప్పటి నుంచి విచారణ ముగిసేదాకా కేటీఆర్, హరీశ్​రావు కేసీఆర్ ఇంట్లోనే ఉన్నారు. కార్యకర్తలను నందినగర్ ​ఇంటి దగ్గరికి రాకుండా కొద్ది దూరంలోనే పోలీసులు నిలిపేశారు. మీడియాకూ అనుమతివ్వలేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్​ నేతలు తెలంగాణభవన్​ వద్ద ఉండిపోయారు. అక్కడే నిరసనలకు పిలుపునిచ్చారు. 

సీఎం ఇంటి ముట్టడికి యత్నం..

పలువురు బీఆర్​ఎస్​ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి తెలంగాణ భవన్​లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సీఎం రేవంత్​ ఇంటితో పాటు మినిస్టర్స్​ క్వార్టర్స్​ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని తెలంగాణ భవన్​ వద్దే పోలీసులు అడ్డగించారు. అనంతరం తెలంగాణ భవన్​ నుంచి నందినగర్​వెళ్లేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విచారణ ముగిసే వరకు వారిని భవన్​ నుంచి పోలీసులు కదలనివ్వలేదు. 

రాత్రి 7.50 గంటల సమయంలో సిట్​ విచారణ పూర్తయ్యాక నేతలంతా ర్యాలీగా నందినగర్​ ఇంటి వద్దకెళ్లారు. భారీగా కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. విచారణ పూర్తయ్యాక కేసీఆర్​ బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉదయం 10.30కు ఎర్రవల్లి నుంచి భారీ కాన్వాయ్​తో కేసీఆర్​ హైదరాబాద్​కు బయల్దేరారు. 

ఎమ్మెల్యేలతో కేసీఆర్​ భేటీ

సిట్​ విచారణ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్​ సమావేశమయ్యారు. మున్సిపల్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలో రెబెల్స్​ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ బలంగా ఉందని, కష్టపడితే మున్సిపల్​ ఎన్నికల్లో గెలవొచ్చన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయని విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతున్నదని, త్వరలోనే చాలా మంది పార్టీలో చేరుతారని వారికి చెప్పారు.