అయినా.. సారు మారలేదు

అయినా.. సారు మారలేదు

ప్రజాస్వామ్యంలో పార్టీలతోనే రాజకీయం. జనానికి నచ్చితే గెలిపిస్తరు. నచ్చకుంటే ఓడిస్తరు. జనానికి మనం తప్ప దిక్కులేదని పార్టీలు ఫీలయితే అదే జనం కొత్త దారిని  వెతుక్కుంటరు. ఇది ప్రజాస్వామ్య సూత్రం కూడా. గెలుపు మా హక్కని విర్రవీగేవాళ్లకు ఓటమిని రుచి చూపిస్తరు. అయితే ఒక్క ఓటమితోనే పార్టీల కథ ముగిసిపోదు. పార్టీ పనిచేసే తీరే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, పదేండ్ల అధికార నేపథ్యంగల ఓ రాజకీయ పార్టీ ఒక్క ఓటమితోనే ఇంత కుంగిపోవాల్సిన పరిస్థితులెందుకొచ్చాయన్న చర్చ జరుగుతున్నది. నిర్మాణ రహిత నినాదాలతో, భావోద్వేగ ప్రసంగాలతో భావ సారూప్యతను ఎల్లకాలం కొనసాగించలేవు. ఏ భావోద్వేగ నినాదాలు తెలంగాణ సమాజంలో నిప్పు పుట్టించాయో అవే నినాదాలు ఆ పార్టీ సమస్థాన్ని కల్లోలభరితం చేస్తున్నాయి. ఇవాళ పార్టీ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి నేతలు వాలిపోవడం రాజకీయాల్లో సహజమే. కానీ, కేవలం 90 రోజుల్లోనే  పార్టీ ఒక్కసారిగా తిరోగమనం పడుతున్న తీరును కేసీఆర్ ఇంకా అర్థం చేసుకోకపోవడం విచారకరం. 

ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరించిన తీరు, ఆ తర్వాత అధికారం కోల్పోయిన విధానం, కారణాలను ఆత్మావలోకనం చేసుకునే తరుణమిది. అధికారం కోల్పోయినంక  ఆ పార్టీ ఆఖరుకు 24 ఏండ్ల పార్టీ సుదీర్ఘ ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడికే తొంగి చూడాల్సి వచ్చింది. 2001, మే 17 ఎర్రటి ఎండల్లో అదే కరీంనగర్ మైదానంలో నిర్వహించిన సింహగర్జన, అలాగే అధికారం కోల్పోయిన అనంతరం మళ్లీ అదే మైదానంలో రెండు రోజుల క్రితం వరకు జరిగిన సభల మధ్య జరిగిన అనేక ఘట్టాలను, పరిణామ క్రమాన్ని అవలోకనంతో విశ్లేషించుకుంటే బావుంటుంది. 

ఓడించిన ప్రజలనే నిందించడం ఏ సంస్కృతి?

నిజానికి కేసీఆర్ కరీంనగర్ సభపై తెలంగాణ సమాజం ఓ మార్పు ఆకాంక్షించింది. ఎందుకు ఓడినం.. పొరపాటు ఎక్కడ జరిగిందో బేరీజు వేసుకోకుండా, మళ్లీ పార్టీ ద్విగుణీకృత ఉత్సాహంతో క్యాడర్, లీడర్లతో పార్టీని ఎలా ముందుకు నడిపించాలో ఆలోచన చేయకుండా, ఎంతసేపు జనం తప్పు చేశారు. ఆ జనమే ఆ శిక్షను అనుభవించాలన్నట్టుగా కేసీఆర్ ప్రసంగించిన తీరు మరోసారి వివాదాలకు, విమర్శలకు అవకాశం ఇస్తున్నది. అసెంబ్లీ ఫలితాల అనంతరం కేసీఆర్ చాల రోజులు మౌనంగా ఉండి నల్లగొండ సభకు వెళ్లి కేఆర్ఎంబీ, కాళేశ్వరం అంశాలపై మాట్లాడి పార్టీని మళ్లీ ఉద్యమం వైపు తీసుకెళ్తున్నట్టు సంకేతం ఇచ్చారు. ఆ సభలోనూ జనం ఓడించి తప్పు చేశారని చెప్పుకొచ్చారు. మళ్లీ కరీంనగర్ సభలో కూడా రెట్టింపు చేసి మాట్లాడిన తీరును తెలంగాణ మేధావిలోకం, బుద్ధి జీవులు హర్షించడం లేదు. గతంలో కేసీఆర్ తిట్లదండకాలు, నిన్న ఆయన ప్రసంగంలో చెప్పిన నీతి వ్యాఖ్యలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోన్ని అని మాట్లాడడం చూస్తే కేసీఆర్ ఇప్పట్లో నేల కింద చూడరనే అర్థం చేసుకోవాలి. 

చింత చచ్చినా పులుపు చావలె

కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన ఈ  90 రోజుల్లో  కేసీఆర్ దృష్టిలో కాంగ్రెస్ పాలన సరిగ్గా లేకపోవచ్చు. సీఎం రేవంత్ వ్యవహార శైలి నచ్చకపోవచ్చు గాక.. రాజకీయ పార్టీగా అధికార పక్షంపై ఏమైనా మాట్లడవచ్చు. కాని చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా తమను ఓడించి జనం తప్పు చేశారని, తప్పంతా జనానిదే అన్నట్టుగా మాట్లాడితే అదే జనం నుంచి మరింత తిరుగుబాటు వస్తుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికల్లో ఆశపడి జనం ఓట్లేస్తరా? ఎన్నికల్లో అత్యాశకు పోయి ఓట్లేస్తరని, బీఆర్ఎస్​కు ఓటేయకుంటే జనం తప్పు చేశారని మాట్లాడడాన్ని ప్రజాస్వామిక వాదులు తప్పుబడుతున్నారు. నిజానికి చెప్పాలంటే రేవంత్​కు జనం ఓట్లేశారా.. కాంగ్రెస్ పాలన బాగుంటుందని జనం నమ్మారా, ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యారా  అన్న అంశాలు పక్కన బెడితే ఉన్నపళంగా బీఆర్ఎస్ మాత్రం అధికారం నుంచి దిగిపోవాలని జనం భావించారన్నది వాస్తవం. జనం కష్టాల్లో ఉన్నా సరే గాని కేసీఆర్​ను గద్దె దించడాన్ని జనమే  అనివార్యతగా భావించారు.  

 ప్రజలను హీనంగా భావించారు

అధికారం దూరం కావడానికి సవాలక్ష కారణాల్లో మనుషులను మనుషులుగా చూడకపోవడం ఒకటి. దొరల దురహంకారంతో, దుష్టాంతాలతో పాలన సాగిందన్న విమర్శలున్నాయి.  పేదరికాన్ని అవహేళన చేసిన సందర్భాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను  బిచ్చగాళ్ళుగా, పురుగుల కంటే హీనంగా చూసిన సందర్భాలు  కోకొల్లలుగా వైరల్ అయ్యాయి. కేసీఆర్, మొదలు కేటీఆర్, సంతోష్ రావు,  ఆయన మంత్రివర్గంలోని కొందరు, కేసీఆర్ చుట్టూ చేరిన వారు,  అహంభావం, అహంకారం, అతి విశ్వాసపు  దుర్లక్షణాలను పుణికి పుచ్చుకున్నారన్నారని జనం భావించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, ఎవరిని పడితే వారిని దుర్భాషలాడారు, చివరకు వ్యవస్థలను తూల నాడడం,  ప్రతిపక్షాన్ని, గవర్నర్​ను మంత్రులను, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చిన్న చూపు చూశారో జనం గుర్తు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరినీ ప్రగతి భవన్ గేటు తాకనీయలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు.

అతి విశ్వాసం, అహంకారమే ఓటమికి కారణం

2023 ఎన్నికల్లో పార్టీ, అధినేత చేసిన తప్పులను, క్షేత్ర నివేదికలను కేటీఆర్ సహా సొంత మనుషులెవ్వరూ ధైర్యంగా చెప్పలేకపోయారు. పార్టీకి గడ్డు కాలమని తెలిసినా లైట్ తీసుకున్నారు. రైతు బంధు, బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు కేసీఆర్​ను అందరివాడని కీర్తించినా.. దళిత బంధు, బీసీ బంధు పెట్టి కొందరివాడుగా ముద్రపడ్డారు. ఇలా చెప్పుకుంటే అనేకం ఉన్నా 2023 ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం వరకు మితిమీరిన అతివిశ్వాసం, అహంకారం వెరసి చేదు ఫలితాలను అనుభవించారు. ఫలితాలు చూసాక ఎమ్మెల్యేల వల్లే ఓడామని కేసీఆర్, ఆయన వల్ల, ఆయన కుటుంబం వల్ల నష్టపోయామని పార్టీ లీడర్లు ఒకరిపై  మరొకరు పరస్పరం దుమ్మెత్తిపోసునే పరిస్థితి. చివరకు రాజీనామా సమర్పించే సంప్రదాయాన్ని, పక్కన పెట్టి,  ఓట్లేసిన జనానికి ధన్యవాదాలు చెప్పకుండా తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపి, ఫార్మ్ హౌస్​కు వెళ్లిన తీరు జనంలో చర్చకు వచ్చింది.

ఆత్మపరిశీలన అక్కరలేదా?

చాలా పార్టీలు చేసిన తప్పులు ఒప్పుకుని, చెంపలేసుకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్లి జనం మదిని గెలిచాయి. బీఆర్ఎస్​కు, కేసీఆర్​కు కూడా అది సాధ్యమే. కానీ తప్పులేం చేశాం.. ఎక్కడ పొరపాటు చేశామో ఆత్మవిమర్శ ఇప్పటికీ కనిపించదు.  అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోకుండా... అధికారం కోల్పోగానే కుంగిపోకుండా పార్టీని నడపడం లీడర్ లక్షణం. అందర్నీ కాపాడుకోవడం, కలుపుకుపోవడం పార్టీ కర్తవ్యం. దాన్ని నిలబెట్టడం క్యాడర్ విధి. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలను చదివి, ఉద్యమ నేపథ్యాలను ఆపోసన పట్టి ప్రత్యేక లక్ష్యంతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉద్యమ పార్టీగా అనేక ఎత్తు పల్లాలనూ చవిచూసింది.  కానీ, అలా అధికారం కోల్పోగానే ఇలా లీడర్లు, క్యాడర్లు అంతే జెట్ స్పీడ్​తో పార్టీని ఎందుకు వదిలి వెళ్తున్నారో సమీక్షించుకోవాలి.   పార్టీలో ఉండలేమని మొర్రో అంటే ఇంటివద్దకు కాళ్లబేరానికి ఎందుకు 
పోతున్నారో  ఆత్మ పరిశీలన చేసుకోవాలి.  

ఆత్మగౌరవాన్నే  దెబ్బతీశారు

 కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు,  ప్రతిపక్ష నేతల బలం కన్నా  కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, అరోగెన్స్, కరప్షన్, మనుషులను మనుషుల్లా చూడకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందని నిజాన్ని తెలుసుకోవాలి. తన సొంత మనుషుల ఫోన్లు ట్రాప్ చేసారంటే ఎలా అవమాకరంగా వ్యవహరించారో చర్చ జరుగుతున్నది. తెలంగాణ జనం ఆకలినైనా భరిస్తారు కానీ.. ఆత్మగౌరవం పోతుంటే భరించలేరన్న అసలు నిజాన్ని తెలుసుకోలేకపోయారు. కారుకు తాత్కాలిక బ్రేక్​లు పడ్డాయని, కాంగ్రెస్​కు త్వరగా వ్యతిరేక పవనాలు వీస్తాయని లీడర్స్​కు , క్యాడర్​కు అధినేత కేసీఆర్ ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీని, అధినేతను లీడర్, క్యాడర్ నమ్మడం లేదు. లోక్​సభ ఎన్నికల్లో నమ్ముకున్న అభ్యర్థులే పారిపోతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అండ్ కో నేలపై నడిచి గొంగలి పురుగునైనా ముద్దాడాలి. 

-  వెంకట్  గుంటిపల్లి, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం