
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. మాజీ మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం తీహార్ జైలులో కవితను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు కవితతో వారు ముచ్చటించారు. ఈ సందర్భంగా కవితకు ధైర్యం చెప్పారు. దాదాపు రెండు నెలల తర్వాత గతవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీహార్ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు. తొలిసారి తీహార్ జైలుకు వెళ్లిన కేటీఆర్, కవితతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. న్యాయ సలహాతో పాటు, తాజా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే రోజు సాయంత్రం ప్లానింగ్ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా కవితను కలిసి ధైర్యం చెప్పారు. అంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర పార్టీ నేతలు ఆమెను కలిశారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలతోనే కవితను కలిసేందుకు ఢిల్లీ వస్తున్నట్టు నేతలు చెప్తున్నారు. లిక్కర్ స్కాంలో మే 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దాదాపు రెండున్నర నెలలుగా ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు.