కూన శ్రీశైలం గౌడ్​పై ఎమ్మెల్యే వివేకానంద దాడి

కూన శ్రీశైలం గౌడ్​పై ఎమ్మెల్యే వివేకానంద దాడి

హైదరబాద్, వెలుగు : కుత్బుల్లాపూర్ లో బుధవారం నిర్వహించిన డిబేట్​లో  బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం గొడవకు దారి తీసింది.  ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఒకరిపై ఒకరు భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు తీవ్రం కాగా.. వివేకానంద సహనం కోల్పోయి  శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లి ఆయన గొంతు పట్టుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులు వివేకానందను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు.

 దీంతో చర్చా కార్యక్రమం రసాభాసాగా మారింది. బీఆర్ఎస్​, బీజేపీ కార్యకర్తలు స్టేజీపైకి వచ్చి ఫర్నీచర్​ ధ్వంసం చేశారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంపై ఎమ్మెల్యే వివేకానంద దాడి చేయడాన్ని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వివేకానందపై  కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. లేదంటే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.  

ALS0 READ: కోస్గిలో ఫ్లాగ్ మార్చ్

ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కూన శ్రీశైలం గౌడ్ పై దాడి ఘటన బాధాకరమన్నారు. వివేకానందపై కేసు ఫైల్ చేసి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ​మండిపడ్డారు.