హైదరాబాద్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ఎమ్మెల్యేలు, నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. నామినేషన్ల నుంచి పోలింగ్వరకూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అరాచకాలకు పాల్పడిందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించారని, దాడులకు తెగబడి హీనమైన రాజకీయాలు చేశారని మండిపడ్డారు. చట్టాన్ని కూడా లెక్క చేయకుండా కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు.
కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని పేర్కొన్నారు. అధికార పార్టీ అకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన కార్యకర్తలు, ఇన్చార్జ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
