హత్యలు, దొంగతనాలు.. జగదీశ్​​రెడ్డి.. ఇదీ నీ చరిత్ర: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హత్యలు, దొంగతనాలు.. జగదీశ్​​రెడ్డి.. ఇదీ నీ చరిత్ర: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • మర్డర్​ కేసుల్లో 16 ఏండ్లు కోర్టుల చుట్టూ తిరిగిండు
  • ఆయనపై పెట్రోల్​ బంకులో దొంగతనం చేసిన కేసు
  • జిల్లా నుంచి ఏడాది పాటు బహిష్కరించారని వెల్లడి 
  • ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్త: జగదీశ్ రెడ్డి
  • నిరూపిస్త.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: మంత్రి
  • అసెంబ్లీలో కరెంటు పద్దుపై చర్చ సందర్భంగా సవాళ్లు.. ప్రతిసవాళ్లు

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ​రెడ్డి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కిరాయి హత్యలు, దొంగతనాలే.. ఆయన చరిత్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని జగదీశ్​రెడ్డి సవాల్ ​చేయగా.. కచ్చితంగా నిరూపిస్తానని రాజీనామాకు రెడీగా ఉండాలని ప్రతిసవాల్ చేశారు. సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా విద్యుత్ అంశంపై జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ అక్రమాలపై జుడీషియల్ కమిషన్ వేశామని చెప్పుకునెటోళ్లు నిక్కచ్చిగా ఉన్నారా అని ప్రశ్నించారు.

 కమిషన్​కు నియమించిన చైర్మన్​పై ఆరోపణలున్నాయన్నారు. హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్​రెడ్డి జోక్యం చేసుకొని బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా చదివారు. తర్వాత జగదీశ్​రెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వగా.. కేసీఆర్ ​కాలిగోటికి కూడా మీరు సరిపోరని.. ఆయన గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొలగించాలని.. సభను హుందాగా నడిపించాలని అన్నారు. దీంతో మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి కల్పించుకొని.. జగదీశ్ ​రెడ్డి చరిత్ర అంతా కిరాయి హత్యలు, దొంగతనాలే అని అన్నారు. ‘‘జగదీశ్ రెడ్డిపై మర్డర్ కేసులున్నాయి, ఆయన తండ్రి మీద చాలా కేసులున్నాయి. హత్య కేసుల్లో జగదీశ్​16 ఏండ్లు కోర్టుల చుట్టూ తిరిగారు. 

ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో అక్రమ మద్యం కేసులో కూడా అరెస్టు అయ్యారు. ఓ మాజీ ఎమ్మెల్యే పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌లో రూ.1.80 లక్షలు దొంగతనం చేసిన కేసులో కూడా ఆయన నిందితుడు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జగదీశ్వర్‌‌‌‌ రెడ్డి స్పందిస్తూ.. మంత్రి వెంకట్​రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదన్నారు. వాటిని నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని చెప్పారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి కోమటిరెడ్డి, సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్‌‌‌‌ చేశారు. దీంతో సవాల్‌‌‌‌ని స్వీకరిస్తున్నట్లు మంత్రి ప్రతిసవాల్‌‌‌‌ చేశారు. జగదీష్​ రెడ్డిపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తానన్నారు. నిరూపించకపోతే తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

డమ్మీ మంత్రిని నేనే అంత సంపాదిస్తే నిజమైన మంత్రి  రూ.20 లక్షల కోట్లు సంపాదిస్తరా? 

గత ప్రభుత్వంలో తాను డమ్మీ మంత్రిని అంటున్నారని, డమ్మీ మంత్రినైన తానే రూ.20 వేల కోట్లు  సంపాదిస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో నిజమైన మంత్రులమని చెప్పుకునేటోళ్లు రూ.20 లక్షల కోట్లు సంపాదిస్తరా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తన ఆస్తుల మీద విచారణ చేసుకోవచ్చని అన్నారు. విద్యుత్‌‌‌‌ కోతలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు చెత్త అంటూ జగదీశ్​రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌‌‌‌ తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి.. జగదీశ్​రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్​రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజశ్వర్ రెడ్డి వెల్​లోకి దూసుకెళ్లారు. జగదీశ్​రెడ్డిపై మంత్రి కామెంట్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. స్పందించిన స్పీకర్ మంత్రి వ్యాఖ్యలను పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్నవాటిని తొలగిస్తామని చెప్పారు. దీంతో వారు తిరిగి వెళ్లి సీట్లలో కూర్చున్నారు. 

జగదీశ్ రెడ్డికి శంషాబాద్​లో 80 ఎకరాలు: వెంకట్​రెడ్డి 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చిట్టా అంతా త్వరలో బయటపెడతానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. ఆయన పెద్ద దొంగ అని సోమవారం మీడియాతో చేసిన చిట్ చాట్ లో అన్నారు. ఆయనపై మర్డర్ కేసులు ఉన్నది నిజమేనన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నా దగ్గర రూ.10 వేలు రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడన్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించటంతో పాటు శంషాబాద్​లో 80 ఎకరాల భూమి, చాలా ఫామ్ హౌస్ లు ఉన్నాయని చెప్పారు. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడతానని తెలిపారు.