కేసీఆర్​ను తొందర్లోనే సీఎం చేస్కుందాం : కేటీఆర్

కేసీఆర్​ను తొందర్లోనే  సీఎం చేస్కుందాం : కేటీఆర్
  • కరీంనగర్​ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​
  • మనకు తగిలింది చిన్న దెబ్బనే.. పాపమని కాంగ్రెసోళ్లకు జనం ఓటేసిన్రు
  • హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్​ బట్టలిప్పి ఊరేగిస్తం
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు
  • సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్టు కాలేదు 
  • కరీంనగర్​కు సంజయ్​ నయాపైసా తేలేదు
  • అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్  

కరీంనగర్, వెలుగు:  కేసీఆర్ ను తొందర్లోనే ముఖ్యమంత్రిని చేసుకుందామని పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కొత్త సర్కార్ కు వంద రోజుల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడే మాటలను గవర్నర్ తో మాట్లాడించాక ఆ అభిప్రాయం మార్చుకున్నం. మహారాష్ట్రలోలాగా రేవంత్ రెడ్డి తెలంగాణ‌‌‌‌ ఏక్ నాథ్ షిండే కాబోతున్నాడు. ఆయన మూలాలు బీజేపీలో ఉన్నయ్’’ అని పేర్కొన్నారు. కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితం అంత నిరాశజనకమైన ఫలితం కాదు. ప్రజలను కించపరిచే మాటలు సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడొద్దు. ఆనాడు మనకు మద్దతుగా నిలబడింది.. రెండుసార్లు గెలిపించింది అదే ప్రజలు. ప్రజల తీర్పును అవమానించేలా మాట్లాడొద్దు. మొన్న మనకు తగిలింది చిన్న దెబ్బ. ప్రజలు మనకు మూడో వంతు‌‌‌‌ సీట్లు ఇచ్చారు. 14  నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఆరేడు సీట్లు మనం గెలిచినా పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు” అని కేటీఆర్ అన్నారు. మండలానికో వార్ రూమ్ పెట్టుకుందామని, నియోజకవర్గానికో సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర స్థాయి కమిటీతో సోషల్ మీడియా టీమ్ ను బలోపేతం చేసుకుందామని తెలిపారు. కాంగ్రెస్ వైపు చూస్తున్న మైనార్టీలు ఒకసారి పునరాలోచన చేయాలని కోరారు. 

ఏడ్చుకుంట ఓట్లడిగి గెలిచిన్రు..  

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు అయ్యో పాపమని ఓట్లేస్తే గెలిచారని కేటీఆర్ అన్నారు. ‘‘మన దేశ ప్రజలు భావోద్వేగాల మీద ఓటేస్తారని కొత్తపల్లి మైనారిటీ నేత జమీల్ నాతో చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అదే జరిగింది. ధర్మపురి, మానకొండూరు, వేములవాడ ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వాళ్లు ఇల్లిల్లు తిరుగుతూ ఈ ఒక్కసారన్న గెలిపించండని ఏడ్చి ఓట్లడిగారు. ఏడుసుకుంట.. తుడుసుకుంట గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు ప్రకటించిన 420 హామీలను అమలు చేయించాలి. లేదంటే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి ఊరేగిస్తాం” అని అన్నారు. 

మేం రాజకీయాలకు గుళ్లను వాడుకోలే.. 

బీజేపీ వాళ్లు వచ్చినంకనే మనకు బొట్టు పెట్టుకోవడం తెలిసినట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లలా రాజకీయానికి దేవుడిని వాడుకోలేదన్నారు. ప్రపంచమే అబ్బురపడేలా యాదాద్రిని కట్టినా, దాన్ని రాజకీయం చేయాలని కేసీఆర్ ఏనాడూ అనుకోలేదన్నారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని నిలువరించిందే బీఆర్ఎస్. పెద్ద లీడర్లమనుకునే బండి సంజయ్, అర్వింద్, ఈటలను ఓడించింది బీఆర్ఎస్సే. బీజేపీకి దగ్గర కాబట్టే బీఆర్ఎస్ నాయకురాలిని అరెస్ట్ చేయడం లేదని ప్రచారం చేస్తున్నారు. కానీ నిజంగా బీజేపీకి బీటీమ్ అయితే అసలు కేసే అయ్యేది కాదు. సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం వల్లే అరెస్టు కాలేదు” అని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. డబుల్ ఇంజన్ లో ఏక్ ఇంజన్ ప్రధాని, దూస్రా ఇంజన్ అదానీ, తీస్రా ఇంజన్ రేవంత్ రెడ్డి. గతంలో అదానీని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ నిలువరించారు. కానీ రేవంత్ రెడ్డి దావోస్ లో వేల కోట్ల ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్ లో రాష్ట్రంలో అన్ని కాంట్రాక్టులు అదానీకే దక్కుతాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్యే రహస్య సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ను ఖతం చేయడమే ఆ రెండు పార్టీల లక్ష్యం. బీజేపీ, కాంగ్రెస్ ఒప్పందంతోనే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయి” అని కేటీఆర్​ ఆరోపించారు. 

సోషల్ మీడియాను నమ్ముకుని రేవంత్ సీఎం అయ్యిండు.. 

సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ సీఎం అయ్యారని కేటీఆర్ అన్నారు. ‘‘ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి.. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లను నమ్ముకుని మోదీ ప్రధా‌‌‌‌ని అయ్యిండు.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు” అని విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేసినోళ్లు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని.. రైతుబంధు రాలేదని రైతులు, మహిళలకు ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు మంట మీద ఉన్నారని అన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇయ్యకపోతే రైతులు చీరిచింతకు కడతారన్నారు. ‘‘బస్సుల్లో ఆడోళ్లు కొట్టుకుంటున్నరు. మగోళ్లు టికెట్టు కొని నిలబడి పోతున్నరు. ఆటో అన్నలు గిరాకీ లేక పస్తులుంటున్నరు. రాష్ట్రంలో  ఎవరూ సంతోషంగా లేరు.  గుంపు మేస్త్రీకి గతంలో పని చేసిన అనుభవం లేదు. రైతుబంధును అడిగితే చెప్పుతో కొడతామని అన్నోళ్లకు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో చెప్పుతో  కొట్టినట్లు ఓటుతో సమాధానం చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కాదని, వారు చెప్పిన అన్ని హామీలను కలిపి లెక్కపెడితే 420 హామీలవుతున్నాయని విమర్శించారు. ఆటో డ్రైవర్ల ఆవేదనను వీడియోలుగా తీసి తమకు పంపాలని సోషల్ మీడియా కార్యకర్తలను కోరారు. 

సంజయ్.. చర్చకు రా..    

కరీంనగర్ ఎంపీగా సంజయ్ ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘‘మా పార్టీ తరఫున వినోద్ కుమార్ వస్తారు. డేట్, టైమ్ చెప్పు.. ‌‌‌‌ఫంక్షన్ హాల్ మేమే బుక్ చేస్తాం” అని అన్నారు. ఐదేండ్లలో కేంద్రం నుంచి సంజయ్ తెచ్చిందేమీ లేదని మండిపడ్డారు. వినోద్ తన పదవీకాలంలో 553 ప్రశ్నలు అడిగితే, సంజయ్ కేవలం 56 ప్రశ్నలే అడిగారని.. ఆయనో అట్టర్ ఫ్లాప్ ఎంపీ అని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు తేలేకపోయాడని అన్నారు. లోక్ సభలో ఎంత సేపు కేసీఆర్ ను తిట్టేందుకే మాట్లాడారని.. కరీంనగర్ కు ఐఐటీనో, నవోదయ స్కూల్సో మంజూరు చేయాలని ఏనాడూ అడగలేదన్నారు.