- అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. వాగ్వాదం
- హైదరాబాద్‌లో నోరు తెరిస్తే దోమలు నోట్లోకే పోతున్నయ్: సుధీర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో దోమల బెడదపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీకి ఫాగింగ్ మిషన్, దోమతెరతో కుట్టిన డ్రెస్ తీసుకుని వచ్చారు. అయితే, భద్రతా సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఫాగింగ్ యంత్రాన్ని, దోమతెరను ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందితో సుధీర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలు నడవనప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలేంటని భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దోమ తెరతో కుట్టించిన డ్రెస్ వేసుకుని అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు.
హైదరాబాద్‌లో నోరు తెరిస్తే దోమలు నోట్లోకి వెళ్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. దోమల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని, ఫాగింగ్ చేయట్లేదని విమర్శించారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియాతో ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. దోమలను నివారించలేని ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణమయ్యారని ఆరోపించారు.
దోమల బెడదకు భయపడి ఎవరూ హైదరాబాద్‌కు రావడం లేదన్నారు. దోమల సమస్యకు పరిష్కారం చూపకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్‌కూ 10 ఫాగింగ్ మెషీన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకున్నట్టే.. ఇప్పుడు దోమల సమస్యను తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చిందని సుధీర్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
