మల్లారెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ

మల్లారెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ

సికింద్రాబాద్, వెలుగు: మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్​అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని, అందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు తీర్మానించారు. ఆదివారం బోయిన్​పల్లిలోని మాజీ మంత్రి, మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయి చర్చించారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలని మొదట మల్లారెడ్డి కుమారుడు కొడుకు భద్రారెడ్డికి బీఆర్ఎస్​అధినేత సూచించారు. 

తన కొడుకు పోటీ చేయడంలేదని మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. మరో బీఆర్ఎస్ నేత శంభీపూర్​రాజును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించగా ఆయన కూడా పోటీకి విముఖత చూపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్​నుంచి ఉప్పల్​నుంచి టికెట్ కు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్​సీనియర్​నేత రాగిడి లక్ష్మారెడ్డి  అనంతరం బీఆర్ఎస్​లో చేరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గెలుపుకు  కృషి చేశారు. దీంతో అధిష్టానం లక్ష్మారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించగా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్​నేతలను కలుస్తూ తన గెలుపుకు సహకరించాలని కోరుతూ వస్తున్నారు. 

ఇందులో భాగంగా ఆదివారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్​నేతలతో మల్లారెడ్డి ఇంట్లో కలిశారు. గెలుపుపై వ్యూహరచన చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు దయానంద్, నవీన్ రావు , మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.