కేటీఆర్​ను కలిసేందుకు ... ఎమ్మెల్యేల క్యూ

కేటీఆర్​ను కలిసేందుకు ... ఎమ్మెల్యేల క్యూ
  • ఎన్నికలకు ముందు పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం
  • ఫండ్స్​, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతులు
  • సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు:  మంత్రి కేటీఆర్​ను కలిసేందుకు బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అసెంబ్లీలోని ఆయన చాంబర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని తమ పనులు చక్కబెట్టాలని కోరారు.  గురువారం అసెంబ్లీ ప్రారంభమవడానికి ముందు, వాయిదా పడిన తర్వాత  కేటీఆర్​ను ఎమ్మెల్యేలు కలిశారు. సెప్టెంబర్ ​నెలాఖరు, అక్టోబర్​లో  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు ఇతర పనులకు ఫండ్స్​, ప్రయారిటీ పనులకు అనుమతులు, ఇతర వ్యవహారాలను కేటీఆర్ ​దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. 


సభ ప్రారంభమవడానికి గంట ముందే కేటీఆర్​అసెంబ్లీలోని తన చాంబర్​కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెయిట్​చేస్తూ కనిపించారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లి తమ విజ్ఞప్తులు చెప్పుకున్నారు. ఆయా పనులపై సీఎం కేసీఆర్​తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేటీఆర్​హామీ ఇచ్చారు. అసెంబ్లీ కమిటీ హాల్​లో చేనేత, జౌళి శాఖపై మంత్రి కేటీఆర్​ఉన్నతాధికారులతో రివ్యూ చేయగా.. రివ్యూ ముగిసే వరకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడే వెయిట్​చేశారు. కేటీఆర్​అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తర్వాతే ఎమ్మెల్యేలు అక్కడి నుంచి బయటకు కదిలారు. 

కేటీఆర్​తో జగ్గారెడ్డి భేటీ

కేటీఆర్​తో సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఆయన చాంబర్​లో కలిసి కాసేపు మాట్లాడారు. అనంతరం కేటీఆర్​తో సమావేశంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో పనిచేసే ఎనిమిది మంది కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, అలాంటి వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అదే విషయం కేటీఆర్​కు చెప్పి వారిని తిరిగి సంగారెడ్డికి రప్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చానన్నారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్నారు.