అబద్ధాలు, మోసాల పునాదులపై సీఎం రాజకీయం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

అబద్ధాలు, మోసాల పునాదులపై సీఎం రాజకీయం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
  • ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​

హైదరాబాద్, వెలుగు: అబద్ధాలు, మోసాల పునాదులపై సీఎం రేవంత్​రెడ్డి రాజకీయం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ఆరోపించారు. రూ.3.47 లక్షల కోట్ల అప్పులు తెచ్చానని చెప్పిన ముఖ్యమంత్రి.. రూ.3.30 లక్షల కోట్ల అప్పులు తీర్చానని అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం కట్టిన అప్పులు రూ.1.67 లక్షల కోట్లేనని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్​ను ముఖ్యమంత్రి బద్నాం చేస్తున్నారని, కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. 

గవర్నర్​ప్రసంగం అబద్ధమని తాను మండలిలో మాట్లాడితే అభ్యంతరం తెలిపారని, కానీ, అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి అబద్ధాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలే తేల్చాలని కోరారు. ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సభ్యులందరూ మద్దతు తెలపాలన్నారు. బడ్జెట్​లో విద్యాశాఖకు 8 శాతం నిధులే ఇచ్చారని, దీనిపై విద్యా కమిషన్​చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు.