
- రేవంత్, ఉత్తమ్ గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు
- కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే బనకచర్ల కడ్తున్నరు
- మేఘా కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చే కుట్రలు జరుగుతున్నయ్
- తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు
- స్పందించకపోవడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాలనుకోవడం సరైన నిర్ణయ మేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయంలో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పు. ఏదో ఒక రోజు బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే. ఓ నాలుగు రోజులు టైం తీసుకుంటే తీసుకుంటారేమో” అని ఆమె వ్యాఖ్యా నించారు. గురువారం కవిత తన నివాసంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. అనంతరం చిట్ చాట్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్సు తేవడం సరైందేనని మీడియా చిట్‌చాట్‌లో ఆమె అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేశానన్నారు. తనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఇంత వరకు స్పందించలేదని, దీన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.
బనకచర్లపై రేవంత్‌ది మేకపోతు గాంభీర్యం
బనకచర్లపై చర్చ పెడితే వెళ్లబోనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారని, తీరా కేంద్రం నిర్వహించిన సమావేశంలో మొదటి ఎజెండా అదేనని ప్రెస్మీట్లో కవిత విమర్శించారు. ‘‘సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కలిసి సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నడు. తెలంగాణ హక్కులను కాలరాసిన సీఎం తన పదవికి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏ లాభమూ లేదు. కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసం బనకచర్ల కడుతున్నరు. బనకచర్ల ప్రాజెక్టును ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తం.
పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. లేదంటే మేమే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తం’’ అని ఆమె దుయ్యబట్టారు. ఏపీలో నీళ్లు రాని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి తీసుకుపోతే తానూ స్వాగతిస్తానని.. కానీ, బనకచర్ల విషయంలో మాత్రం మేఘా కంపెనీకి కాంట్రాక్టును అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాగృతి తరఫున బనకచర్లపై పోరాడుతామని, ఆ ప్రాజెక్టును ఆపితీరుతామని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చే జరగలేదని తెలిపారు. కాగా.. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడని, ఆయనకు టీబీజీకేఎస్ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని కవిత పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, ఆయన్ను తాను జనాభా లెక్కల నుంచి తీసేశానని వ్యాఖ్యానించారు.