అరెస్టులపై ఈసీ జోక్యం చేసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

అరెస్టులపై ఈసీ జోక్యం చేసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
  • ఢిల్లీ కోర్టు వద్ద మీడియాతో కవిత

న్యూఢిల్లీ, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ముందు దేశంలో జరుగుతున్న పొలిటికల్ లీడర్ల అరెస్టులపై ఎన్నికల సంఘం(ఈసీ) జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన అరెస్ట్ను న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. శనివారం సీబీఐ స్పెషల్ కోర్టు హాల్ లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు మీడియా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ‘‘ఇది పూర్తిగా పొలిటికల్, ఫాల్స్, ఫ్యాబ్రికేటెడ్ కేసు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. ఈడీ అవే ప్రశ్నల్ని పదే పదే వేస్తోంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. లోక్ సభ ఎన్నికల టైంలో ఇలాంటి అరెస్ట్ లు చేయడం తప్పు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అరెస్టులపై తప్పకుండా జోక్యం చేసుకోవాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అని ఆమె అన్నారు. జై తెలంగాణ అని నినాదం చేస్తూ ఈడీ అధికారుల వెంట కస్టడీకి వెళ్లారు. 

చేతికి రుద్రాక్ష దండ.. నుదుట విభూతి 

కవిత శనివారం పింక్ కలర్ చీరలో రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఆమె ఎడమ చేతికి పసుపు రంగు రుద్రాక్ష దండ, నుదుట విభూతితో కనిపించారు. ఇంతకుముందు ఏకాదశి సందర్భంగా కస్టడీలోనే ఉపవాసం చేసిన ఆమె భగవద్గీత పారాయణం కోసం ఆ పుస్తకాన్ని తెప్పించుకున్నారు. శనివారం భారీ బందోబస్తు మధ్య కవితను ఈడీ అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కవితను తరలించే వెహికల్ కు ముందు రెండు, వెనకాల రెండు వాహనాలతో భద్రత కల్పించారు. ఈడీ ఆఫీసు నుంచి కోర్టుకు తరలించే రూట్లలో బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. కోర్టు ప్రాంగణంలోకి బయటివారిని అనుమతించలేదు. కవితను చూసేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఆమె అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు వచ్చారు. నేషనల్ మీడియా ప్రతినిధులతో కోర్టు హాల్ సైతం కిక్కిరిసిపోయింది. 

కవితను కలిసిన భర్త అనిల్, కొడుకు ఆదిత్య 

ఈడీ కస్టడిలో ఉన్న కవితను శనివారం ఆమె భర్త అనిల్, పెద్ద కొడుకు ఆదిత్య, వరుసకు సోదరి అయిన ననిత కలిశారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో రోజువారి అంశాలను మాట్లాడు కున్నారు. కొడుకు ఆదిత్యతో కవిత కాసేపు ఆనం దంగా ముచ్చటించారు. అనంతరం న్యాయపరమైన అంశాలపై భర్త అనిల్​తో చర్చించారు.