రాష్ట్రపతికి మేం వ్యతిరేకం కాదు : కేకే

రాష్ట్రపతికి మేం వ్యతిరేకం కాదు : కేకే

రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. రాష్ట్రపతికి తాము వ్యతిరేకం కాదని, ప్రజాస్వామబద్దంగా నిరసన మాత్రమే తెలిపామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక, మహిళా, గిరిజన సమస్యలను పట్టించుకోదని, అసలు 8ఏండ్లలో మోడీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు.  రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం ప్రస్తావనేలేదని వాపోయారు. 

ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపకపోతే ఎలా అని కేకే ప్రశ్నించారు. తెలంగాణలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. బడ్జెట్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కారణంగా ఆప్ ఇబ్బందులు పడుతుండగా.. కేరళ, తమిళనాడుల్లోనూ గవర్నర్ల కారణంగా ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. వీటన్నింటినీ అందరి దృష్టికి తెచ్చే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు కేకే స్పష్టం చేశారు.