
- సీఎం రేవంత్ పులిపై స్వారీ చేస్తున్నరు.. ఇక దిగలేరు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు పూర్తిగా ద్రోహం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కామారెడ్డి సభ వేదికగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ను విడుదల చేయించారని.. కానీ, అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు.
శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పెంపు పార్లమెంట్లో చట్టం అయ్యాక.. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాకే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తూనే ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లకు కేసీఆర్ మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారని.. చట్టసభల్లో మహిళలు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు 2014 జూన్ 14న అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్రానికి సిఫార్సు చేశారని గుర్తుచేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ పులిపై స్వారీ చేస్తున్నారని.. కిందకు దిగడం ఇక తేలిక కాదని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ నాయకులు.. వాటిని నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్కు సొంతంగా 100 మంది.. ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి మొత్తంగా 250 మందికిపైగా ఎంపీలున్నారని.. అలాంటప్పుడు రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో పెట్టించాలని డిమాండ్ చేశారు. బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు కొంచెం కూడా లేదన్నారు.