
- కుమారస్వామి, అఖిలేశ్, రైతు సంఘాల నేతలు హాజరు
- బీఆర్ఎస్ కిసాన్ సెల్ చీఫ్గా హర్యానా నేత గుర్నామ్ సింగ్
- నియామక పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్
- ప్రారంభోత్సవానికి హాజరుకాని మంత్రి కేటీఆర్
- బిజీ షెడ్యూల్ వల్లే పోలేదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు:
ఢిల్లీలో బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ ను ఆ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆఫీసును ఓపెన్ చేసి, ఫస్ట్ ఫ్లోర్ లోని తన చాంబర్ లో కూర్చున్నారు. పార్టీకి అనుబంధంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి పేరుతో కిసాన్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అధ్యక్షుడిగా హర్యానాకు చెందిన జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీ, ఆఫీస్ సెక్రటరీగా రవి కొహార్ ను నియమించారు. వీళ్లిద్దరికీ అపాయింట్ మెంట్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘాల నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కాగా, కీలకమైన ఈ ప్రోగ్రామ్ కు కేటీఆర్ హాజరు కాలేదు. కేవలం గంటలోనే బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటలకు అఖిలేశ్, కుమారస్వామితో కలిసి కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీసుకు చేరుకున్నారు. వేద పండితులు ఫణి శశాం క శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. తర్వాత పార్టీ ఆఫీసును ప్రారంభించి, మధ్యాహ్నం ఒంటి గంటకు అందరూ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంటికి వెళ్లారు.
అఖిలేశ్, కుమారస్వామితో భేటీ..
పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముందు ఢిల్లీలోని సీఎం క్యాంప్ ఆఫీసులో అఖిలేశ్, కుమారస్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. వీళ్లిద్దరూ ఉదయం 11 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రాగా, వారితో దాదాపు 40 నిమిషాల పాటు కేసీఆర్ చర్చించారు. పార్టీ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం, భవిష్యత్ ప్రణాళికలు, దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ అవలంబించాల్సిన విధానాలపై చర్చించారు.
కిసాన్ మార్క్ కనిపించేలా..
బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవంలో కిసాన్ మార్క్ కనిపించేలా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన రైతు సమితి సంఘాల అధ్యక్షులను, ఉత్తరాది నుంచి హర్యానా, యూపీ, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రీన్ రిబ్బన్ తో ఉన్న కౌ బాయ్ క్యాప్ ను కేసీఆర్ పెట్టుకున్నారు. దానిపై తెలంగాణకు హరిత హారం అని తెలుగులో రాసి ఉన్న బ్యాడ్జ్ పెట్టుకున్నారు.