ఆదిలాబాద్​లో ఖాళీ అవుతున్న కారు

ఆదిలాబాద్​లో ఖాళీ అవుతున్న కారు
  •     కాంగ్రెస్​లో చేరుతానని ప్రకటించిన కోనేరు కోనప్ప
  •     మాజీ ఎంపీ నగేశ్ బీజేపీలో చేరుతారని ప్రచారం
  •     బోథ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి
  •     అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరం

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్​కు ఆ పార్టీ లీడర్లు షాక్ ఇస్తున్నరు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరేందుకు రెడీ అవుతున్నరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​తో కలిసి తాను పని చేయలేనంటూ ఆ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పిన ఆయన.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్​లో చేరాలంటూ రేవంత్ ఆహ్వానించారని కోనప్ప చెప్పారు. 

తాజాగా మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జోగు రామన్న మినహా మిగిలిన బీఆర్ఎస్ కీలక నేతలంతా బీజేపీ, కాంగ్రెస్​లో చేరడంతో ఆదిలాబాద్​లో కారు ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం గొడం నగేశ్ హైదరాబాద్​లో బీజేపీ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ నెల 12వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. రెండు, మూడు రోజుల్లో టికెట్ కేటాయింపులు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా నగేశ్

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్న గొడం నగేశ్.. ఆ పార్టీ హైకమాండ్​పై అసంతృప్తితో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మొండిచేయి చూపింది. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్​లోనే పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎంపీ టికెట్ అయినా ఇవ్వకపోతారా అన్న ఆశతో ఇన్ని రోజులు బీఆర్ఎస్​లోనే కొనసాగుతూ వచ్చారు.

 తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సీటు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇస్తారనే ప్రచారం జరగడంతో గొడం నగేశ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కొన్ని రోజులుగా స్థానిక బీజేపీ నేతలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో రెండో విడత లోక్​సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటిస్తుండటంతో మరోసారి నగేశ్ చేరిక అంశం తెరపైకి వచ్చింది. గొడం నగేశ్ బోథ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఎంపీగా గెలిచారు. 

బీజేపీ ఆశావహుల్లో కొత్త టెన్షన్

ఇప్పటికే బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం అభ్యర్థులు పోటీ పడ్తున్నరు. తాజాగా నగేశ్ చేరుతుండటంతో ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, జాదవ్ రాజేశ్ బాబు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం పోటీపడుతున్నరు. సిట్టింగ్ సీటు తనకే అంటూ సోయం బాపూరావు ధీాగా ఉన్నారు. మరోవైపు గొడం నగేశ్ బీజేపీలో చేరడం వెనుక ఆంతర్యమేంటనే దానిపై పార్టీలో చర్చ జరుగుతున్నది.