
- ‘వీ6, వెలుగు’ కథనం ఫేక్ అంటూ ట్విట్టర్‌లో తప్పుడు పోస్టులు
- సర్పంచుల ఆందోళనకు జవాబేం చెప్తరు
- వాళ్ల డిజిటల్ కీ ఎందుకు రిటర్న్ చేశారు
హైదరాబాద్, వెలుగు: 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడంపై నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై ‘వీ6 వెలుగు’ కథనాలు ప్రచురించింది. ‘15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి’ అనే వెలుగు కథనం ఫేక్ అంటూ రాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించే ‘ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ’ ట్విట్టర్ ఎకౌంట్ తప్పుడు ప్రచారం చేసింది. అధికార పార్టీకి అనుకూలురైన కొందరు దాన్ని సమర్థిస్తూ ‘వీ6 వెలుగు’పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ పేజీలో ఏకంగా ఇటీవల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ‘మీదేంటి వెలుగా.. గదే అర్థమైంది..’ అంటూ కామెంట్ చేసిన వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. వీ6 వెలుగు ప్రచురించిన కథనం ఫేక్ అయితే గడిచిన నాలుగైదు రోజులుగా సర్పంచులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు.. బీఆర్‌ఎస్ సర్పంచులు పార్టీని ఎందుకు వీడి వెళ్లారు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. అసలు నిధులు దారి మళ్లించనే లేదు అని సమర్థించుకునే ప్రయత్నం చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకున్న డిజిటల్ కీలను సర్పంచులకు ఎందుకు తిరిగిచ్చేశారనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనే డిమాండ్‌లు వస్తున్నాయి.