కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ ఫైర్... పలువురు నేతల అరెస్ట్

కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ ఫైర్... పలువురు నేతల అరెస్ట్
  • ధర్నాలు, రాస్తారోకోలు,  దిష్టిబొమ్మల దహనాలు 

సిటీ నెట్​వర్క్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను సిట్​విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగర్ రోడ్డుపై  ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. కుత్బుల్లాపూర్​లో ఎమ్మెల్సీ శంభీపూర్​రాజు ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఆందోళన చేయగా పోలీసులు అరెస్ట్​ చేశారు. 

బీఆర్ఎస్​వీ లీడర్​గెల్లు శ్రీనివాస్,  కార్యకర్తలతో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లిలో నల్ల కండువాలతో వరంగల్​హైవేపై రాస్తారోకో చేశారు. ఐఎస్​సదన్​చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ స్వప్న, సురేందర్​రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జల్​పల్లిలో మాజీ కార్పొరేటర్ సుక్క శివకుమార్, చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్​లీడర్​ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. 

దోమలగూడ బండ మైసమ్మ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ లీడర్​ఎమ్మెన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని నేషనల్​హైవేపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా చెప్పినా వినకపోవడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్​చేసి పీఎస్​కు తరలించారు. బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీజేఆర్​ చౌరస్తా వద్ద బైఠాయించారు. బీసీ కమీషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.