- వరంగల్ టెక్స్ టైల్పార్క్లో కైటెక్స్‌కు 187 ఎకరాలు
- వాస్తు పేరిట మరో 13.29 ఎకరాల కేటాయింపు
- భూములు ఇవ్వబోమన్న రైతులపై అప్పట్లో దాడులు
వరంగల్, వెలుగు: టెక్స్ టైల్స్ రంగ కంపెనీ ‘కైటెక్స్’ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ. 25 కోట్ల విరాళాలు అందాయి. పోయిన ఏడాది అందిన ఈ విరాళాల విషయం తాజాగా ఎన్నికల సంఘం పబ్లిష్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలతో వెల్లడైంది. అయితే, కైటెక్స్ కంపెనీ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో 200 ఎకరాల భూమిని పొందడం.. అప్పట్లో రైతులపై దాడులు చేసి, బలవంతంగా భూములు తీసుకున్నారన్న ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట, హవేలి సంగెం మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును స్టార్ట్ చేసింది. పార్క్‌లో పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
పార్క్‌కు తమ భూములు ఇవ్వబోమని రైతులు ఎదురుతిరిగినా వినకుండా 731 మంది నుంచి 1,190 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించింది. భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి.. మార్కెట్లో రూ.50 లక్షలకు ఎకరా పలికే భూములను రూ.10 లక్షలకు ఎకరా చొప్పున సేకరించారు. తొలుత కేరళలో రూ. 3,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కైటెక్స్ కంపెనీ ముందుకు రాగా, ఆ కంపెనీ అనేక వివాదాల్లో ఇన్వాల్వ్అయ్యిందన్న కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. తర్వాత అదే కంపెనీకి 2021లో అప్పటి మంత్రి కేటీఆర్ రెడ్ కార్పెట్ పరిచి.. పార్కులో187 ఎకరాలు కేటాయించారు. ఇందులో చిన్నపిల్లల బట్టల తయారీ పరిశ్రమ కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపారు. టెక్స్టైల్ పార్క్‌లో కైటెక్స్ కంపెనీని స్వయంగా కేటీఆర్ ప్రారంభించారు.
రైతులపై దాడులు చేసి..
టెక్స్టైల్ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులు అనేక పోరాటాలు చేశారు. భూములిచ్చిన రైతులకు అనేక ప్రయోజనాలుంటాయని ప్రభుత్వం నచ్చజెప్పింది. దీంతో ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు మిగిలిన భూముల చుట్టూ కంచెలు వేసుకున్నారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో కైటెక్స్ కంపెనీకి187 ఎకరాలు కేటాయించారు. తర్వాత వాస్తు పేరిట మరో13.29 ఎకరాలు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలను కైటెక్స్ కోరింది. మళ్లీ భూముల జోలికి రాబోమన్న ప్రభుత్వం మాట తప్పి13 ఎకరాల భూసేకరణకు నోటీసులు జారీ చేసింది. రైతులు తిరగబడి.. పురుగుమందు డబ్బాలతో ధర్నాలు చేశారు. పోలీసులతో లాఠీచార్జీలు చేయించి, పొలాల్లో ఉరికించారు. అడ్డుపడ్డ రైతులపై దాడులు చేసి, భూములు లాక్కున్నారు.
