సింగరేణిని అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సే : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

సింగరేణిని అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సే : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను అధోగతిపాలు చేసింది బీఆర్ఎస్సేనని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితికి తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్​కే దక్కుతుందని విమర్శించారు. గోదావరిఖనిలోని క్యాంప్​ ఆఫీస్​లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. 2014 నుంచి సింగరేణిని దోచుకున్నదెవరో తేలుద్దామా అని బీఆర్ఎస్​ లీడర్లకు సవాల్ విసిరారు. కోట్లాది రూపాయల సింగరేణి నిధులతో కోల్​బెల్ట్​ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయకుండా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు తరలించుకుపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

సింగరేణి నిధుల వినియోగంపై ఎంక్వైరీ  కమిషన్ వేయాలన్నారు. ఓపెన్ కాస్ట్ గనులను తవ్వబోమని చెప్పిన కేసీఆర్ భూగర్భ గనులను పాతర పెట్టి, రామగుండం మధ్యలో ఓపెన్​కాస్ట్ గనులను తెరిచి ఈ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చారని మండిపడ్డారు. నియోజకవర్గానికి కొత్తగా విద్యుత్​పరిశ్రమను తీసుకువస్తే జీర్ణించుకోలేని బీఆర్ఎస్​ లీడర్లు రేట్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.