మీ సేవకుడినై పనిచేస్తా : చింత ప్రభాకర్

మీ సేవకుడినై పనిచేస్తా : చింత ప్రభాకర్

సదాశివపేట, కంది, వెలుగు : ఆదరించి గెలిపిస్తే మీ సేవకుడినై పనిచేస్తానని బీఆర్ఎస్ సంగారెడ్డి అభ్యర్థి చింత ప్రభాకర్ కోరారు. ఆదివారం సదాశివపేటలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. మళ్లీ బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి చేయని జగ్గారెడ్డి ఎన్నికలు రాగానే ఊళ్ల మీద పడ్డారని విమర్శించారు.

మోస పూరిత హామీలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న జగ్గారెడ్డిని ఏం చేశారో నిలదీసి అడగాలని ప్రజలను కోరారు. తనకు ఆరోగ్యం బాగాలేకున్నా ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు.  ప్రజలకు సేవ చేసే చింతా ప్రభాకర్​ కావాలో, కనీసం ఫోన్​లో కూడా అందుబాటులోకి రాని జగ్గారెడ్డి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

తండ్రి గెలుపు కోసం కూతురు ప్రచారం               

చింతా ప్రభాకర్ గెలుపు కోసం ఆయన కూతురు స్రవంతి,  సంగారెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ లత తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమెరికాలో ఉండే స్రవంతి తండ్రి విజయం కోసం ప్రచారం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రజా సమస్యలను తీర్చడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటి ఇంటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో బత్తుల శ్రీనివాస్, నవీన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.